తేటతెల్లమైన కుట్రలు | - | Sakshi
Sakshi News home page

తేటతెల్లమైన కుట్రలు

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

● చంద్రబాబు మార్క్‌ రాజకీయం

● కోర్టుల సాకుతో బీసీలకు టీడీపీ వెన్నుపోటు

● చెల్లవని తెలిసే జీఓలతో మభ్యపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

బీసీ ఓటు బ్యాంకు కోసం చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల జూదం న్యాయస్థానాల వేదికగా బట్టబయలైంది. చట్టపరమైన మద్దతు లేకుండా కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే జీఓలు ఇచ్చారనేది తేటతెల్లమైంది. రాజకీయ అవసరాల కోసం బీసీలను ఏ విధంగా వాడుకుందో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఉదంతం కళ్లకు కడుతోంది. ఎన్నికల ప్రచారంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన టీడీపీ నాయకులు, అధికారంలోకి వచ్చాక కోర్టుల్లో ఏ మాత్రం నిలబడని జీఓలు తెచ్చారు. ముందే తెలిసినప్పటికీ రాజకీయ మైలేజ్‌ కోసం జీఓలు జారీ చేసి, కోర్టుల్లో ఎదురు దెబ్బ తగలగానే తప్పును ఇతరులపై నెట్టేసేందుకు సిద్ధమయ్యారు.

డ్రామా నడిపించారా..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలు హైకోర్టు, సుప్రీంకోర్టులో వీగిపోవడం వెనక చంద్రబాబు మార్క్‌ ముందస్తు వ్యూహం ఉందని తేలిపోయింది. చట్టబద్ధత లేని, నిలకడలేని జీఓలు ఇచ్చి, తీరా కోర్టులు కొట్టేయగానే మేము ఇవ్వాలనుకున్నా కోర్టులు, విపక్షాలు అడ్డుకున్నాయని సాకు చెప్పేందుకు ఈ డ్రామా నడిపించారనే చర్చ జోరందుకుంది.

చటబద్ధత చేశారా..?

బీసీల సామాజిక, రాజకీయ వెనుకబాటు తనాన్ని శాసీ్త్రయంగా అధ్యయనం చేయడానికి 2026 ఫిబ్రవరి 19న రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో డెడికేటేడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ సుదీర్ఘ అధ్యయనం చేసిన తర్వాత ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే, ఆ నివేదికను తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చట్టబద్ధమైన తీర్మానం చేసి, రిజర్వేషన్లు పెంచే ఆర్డినెన్స్‌ తేవాలి. కానీ, ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టకుండా , కేబినెట్‌ ఆమోదం లేకుండానే కేవలం జీఓల ద్వారా 34శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ అప్పటికప్పుడు హడావుడి చేసింది. చట్టపరమైన పునాది లేని ఇలాంటి జీఓలు న్యాయస్థానాల్లో ఒక్క నిమిషం కూడా నిలబడవని తెలిసి కూడా నిర్ణయం తీసుకోవడం వెనక బీసీలను మభ్యపెట్టే వ్యూహం స్పష్టంగా కన్పిస్తుందని బీసీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

కోర్టుల్లో జీఓలు రద్దయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. కోర్టులు అడ్డుకున్నా.. పార్టీ పరంగా బీసీలకు 34శాతం సీట్లు ఇస్తాం అని ప్రకటించడంపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమకు కావాల్సింది చట్టబద్ధమైన రిజర్వేషన్‌ హక్కు, పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే టిక్కెట్లు కాదని అంటున్నాయి. రేపు ఎన్నికల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి, ఇతర వర్గాలను గెలిపించుకునే కుతంత్రం దాగి ఉందనే వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement