కొత్తూరు: మండల కేంద్రంలో కొన్ని రోజులుగా రూ.500ల నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. కొత్తూరు గ్రామం ఒడిశాకు ఆను కుని ఉన్నందున ఒడిశా నుంచి వస్తున్నాయా లేదా కొత్తూరు సరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ విధంగా చెలామణీ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఈ నోట్లపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
14 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమంగా 14.100 కిలోల గంజాయిని తరలించేందు కు ప్రయత్నించిన ఒడిశా గంజాం జిల్లా కొడల పీఎస్‌కి చెందిన రీనాపరిడా అనే ఒక మహిళ, సితూప్రదాన్లను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. గంజాంజిల్లా కొడ ల పోలీస్‌స్టేషన్ పరిధి తలమ్రాపల్లి గ్రామానికి చెందిన రీనాపరిడా కొడల గ్రామానికి చెందిన సితూప్రధాన్ అనే వ్యక్తిని ప్రేమించింది. వారి అవసరాలకు డబ్బు సంపాదన కోసం గంజాయి వ్యాపారి లక్ష్మికాంత్ గౌడ అలియాస్ టిట్టు అనే వ్యక్తిని కలిశారు. ఒడిశా నుంచి గంజాయిని సూరత్ తీసుకెళ్లి అక్కడ వారికి అందజేస్తే రూ.6వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విధంగా ఒడిశా నుంచి సూరత్‌కి పలుసార్లు గంజాయిని నిందితులు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో శుక్రవారం 14.100 కిలోల గంజాయిని తీసుకొని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి ద్విచక్రవాహనం పై చేరుకున్నారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ నుంచి రైలులో సూరత్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా స్థానిక రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు ఒక సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
విదేశీయుల వివరాలు నమోదు చేయాలి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకు వివిధ పనుల నిమిత్తం వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గృహ యజమానులు, ఆస్పత్రులు, సత్రాలు, విద్యాసంస్థలు, తదితర సంస్థల యాజమాన్యాలు తమ వద్ద బస చేసే విదేశీయుల పూర్తి వివరాలు 24 గంటల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎఫ్ఆర్ఆర్ఓ (ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) / ఎఫ్ఆర్ఓ (ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) అధికారులకు నమోదు చేసిన విషయాన్ని తెలియజేయాలని ఎస్పీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం – 2025 సెక్షన్ 8 ప్రకారం విదేశీయుల వివరాలను ఫారం–సి ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని, ఇందుకోసం అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను సమర్పించాలన్నారు. నిర్ణీత సమయంలో నమోదు చేయకుండా నిబంధనలు ఉల్లంఘించే సంస్థల యాజమాన్యాలపై ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం –2025. సెక్షన్ 23(బి) ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష పడుతుందన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు కలిగిన భారతీయులు భారత దేశ ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు వేయడం, వ్యవసాయ భూముల కొనుగోలు వంటి అంశాల్లో అమలులో ఉన్న చట్టపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.


