● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం భజన రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. చట్టబద్ధత లేని జీఓలు ఇచ్చి న్యాయస్థానాల్లో నిలబడదని తెలిసి కూడా ప్రభుత్వం కావాలనే బీసీలను మోసం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నాటకాలు అన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమేనని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం పరిమితి దాటాలంటే ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర వివరాలు సేకరించాలని, అది పక్కన పెట్టి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా జీఓలు ఇచ్చి కోర్టుల్లో కొట్టివేసేలా కుట్రలు చేశారని వివరించారు. ఇప్పుడు కోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ ప్రభుత్వం తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి భజన చేస్తోందని కృష్ణదాస్ అన్నారు. వైఎస్ జగన్ హయాంలో క్యాబినేట్, జెడ్పీ పీఠాలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సింహభాగం దక్కిందని గుర్తు చేశారు.
వెన్నుపోటు చంద్రబాబు నైజం
చంద్రబాబు తన రాజకీయ జీవితం మొత్తం బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పదవి కోసం బీసీలను పావులుగా వాడుకుని ఆ తర్వాత కోలుకోలేని వెన్ను పోటు పొడుస్తారు. ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో 34 శాతం సాధ్యం కాదని తెలిసి మరీ బీసీలను మభ్యపెట్టడానికే చంద్రబాబు డ్రామాలు ఆడారు.
– జీవీ రెడ్డి మాస్టారు, మేధావుల ఫోరం అధ్యక్షుడు, బీసీ విభాగం ప్రతినిధి, టెక్కలి
చంద్రబాబునాయుడు పెద్ద డ్రామా చేస్తున్నారు. డెడికేటెడ్ నివేదిక బయటకు ఇవ్వకుండా రిజర్వేషన్లు పెంచుతూ జీఓలు ఇవ్వడంపై కోర్టు సీరియస్ గా స్పందించింది.
– పేడాడ శ్రీరామమూర్తి, బీసీ నాయకుడు, దవళపేట జి.సిగడాం


