నందిగాం: నర్సిపురం పంచాయతీ కోమటూరుకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇప్పిలి షణ్ముఖరావు(39) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటూరుకు చెందిన జనార్దనరావు, జయలక్ష్మీ దంపతులకు షణ్ముఖరావు ఒక్కడే కుమారుడు. ఆర్మీలో పనిచేసి ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. గ్రామంలో పొట్టేళ్ల ఫారమ్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటలకు పొట్టేళ్ల మేత కోసం ద్విచక్ర వాహనంపై టెక్కలి వెళ్లి తిరిగి 11.45 గంటల ప్రాంతంలో వస్తుండగా టెక్కలి మండలం శాసనాం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తల మీదుగా చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. షణ్ముఖరావుకు భార్య దివ్య, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


