● దసరా ఉత్సవాలకు సిద్ధమైన పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం
● 11 నుంచి రోజుకొక అవతారంలో దర్శనం
● దసరా రోజు వాహనాలకు ప్రత్యేక పూజలు
ఉత్సవాలకు ఏర్పాట్లు..
దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి దేవదాయశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూలైన్తో కూడిన స్టీల్ గేట్లు సిద్ధం చేశాం. పాతపట్నం సీఐ కల్లి వెంకటరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కోసం పాతపట్నం, మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులను విధులు అందించనున్నారు.
– టి.వాసుదేవరావు, కార్యనిర్వాహణాధికారి,
నీలమణి దుర్గ ఆలయం పాతపట్నం
పాతపట్నం:
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు పట్టణమైన పాతపట్నంలో వెలసిన నీలమణిదుర్గ అమ్మవారు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విలసిల్లుతున్నారు. జిల్లావాసులతో ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులతో నిత్యం పూజలందుకుంటున్నారు. నీలమణిదుర్గ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. 1674లో పర్లాకిమిడిని పరిపాలిస్తున్న గజపతి మహారాజుకు చెందిన కూలీలు పొలం దున్నేటప్పుడు అమ్మవారి విగ్రహం నాగలికి తగిలి బయటపడిందని స్థానికంగా ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. అనంతరం అమ్మవారు మహారాజు కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించాలని సూచించడంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి.
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రతి రోజు అమ్మవారు తొమ్మిది రోజులు, రోజుకొక అవతారంలో కనిపిస్తారు. తొలి రోజు ఆదివారం ఉదయం 9.05 గంటలకు వర్థనీ కలశస్ధాపన, విఘ్నేశ్వర పూజ, దేవపుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశం, అఖండదీపస్థాపన, దీక్షా కంకణ దారణ, రుత్విగ్వరుణ, పరిషత్ ప్రాయశ్చిత్తం, కర్కరీ స్థాపన, మండల మంటపావాహనలు, పంచాయతన దేవత ఆవాహనలు, సర్వోతో భద్ర మండలార్చనలు, షోడశ స్తంభ దేవతార్చనలు, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ, దిగ్బలి, మహారాజ భోగాలు, నీరాజన మంత్రపుష్పములు, వేదస్వస్తి నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కుంకుమపూజ, కలశపూజ, అష్టోత్తర శతనామ పూజలు జరుగుతాయని, సాయంత్రం 3 గంటలకు సహస్రనామపూజ, కుంకుమపూజ ఉంటాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.వాసుదేవరావు తెలిపారు.
రోజుకో అలంకరణ..
11న బాలాత్రిపు సుందరిదేవిగా, 12న గాయిత్రి దేవి, 13న అన్నపూర్ణదేవి, 14న మహాచండీ దేవి, 15న లలిత త్రిపుర సుందరి దేవి, 16న సరస్వతి దేవి (మూలనక్షత్రం), 17 మహాలక్ష్మిదేవి, 18న దుర్గాదేవి(దుర్గాష్టమి), 19న మహిషాసురమర్థిని, 20న రాజరాజేశ్వరిగా నీలమణిదుర్గను అలంకరిస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలతో పాటు ఇంత వరకు కలిగిఉన్న వాహనాలకు గుడి వద్ద దసరా రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
11న సాయంత్రం ఆరు గంటలకు బొమ్మిక గ్రాామస్తులతో సంగీత విభావరి, 12న పురాణ విజయలక్ష్మి హరికథ, 13న భక్తీ సంగీత విభావరి, 14న శాసీ్త్రయ సంగీత కచేరి, 16న సినీభక్తి సంగీత విభావరి, 17న భారత నాట్యం, కూచిపూడి నృత్యం విభావరి, 18న భక్తి సంగీత విభావరి, సాయంత్రం 5.30 గంటలకు అమ్మవారి తిరువీది, బాణాసంచా, కాళికా వేషాలు, మేళతాళాలతో నిర్వహించనున్నారు.


