● తమకు అనుకూలంగా ఎన్నిక
నిర్వహించాలన్న కోరం లేని సభ్యులు
● ఎస్ఎంసీ ఎన్నికల మినిట్స్ పుస్తకాలు చించివేత
● మరోసారి ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా
టెక్కలి: కోటబొమ్మాళి మండలం దంత ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల్లో కోరం లేని సభ్యులు బరితెగించారు. తమకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఎంసీ మినిట్స్ పుస్తకాలను చించేశారు. అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షత పాత్రకే పరిమితమయ్యారు. గత నెల 29న ఇదే పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా కోరం లేని సభ్యులు తమకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టడం, మిగిలిన వారువ్యతిరేకించడంతో చివరి నిమిషంలో ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ప్రధానోపాధ్యాయుడు తవిటినాయుడు పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ ఆరంభించారు. రెండో సారి ఎన్నికలు జరుగుతున్నా కనీసం మండల స్థాయి అధికారులు హాజరుకాకపోవడం పలు సందేహా వ్యక్తమవుతున్నాయి. కోరం లేని సభ్యులు మినిట్స్ పుస్తకాలను చించేసినా కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ, సిబ్బంది కట్టడి చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలను మరోసారి వాయిదా వేయడంతో మెజారిటీ కోరం కలిగిన సభ్యులు విస్తుపోయారు.


