సారవకోట: మహాశింగి పంచాయతీ రేగులపాడు గ్రామంలో విద్యార్థులకు చెట్టు కింద పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడున్న పాఠశాల భవనం శిథిలం కావడంతో ఇటీవల కూలగొట్టారు. దీంతో ఉపాధ్యాయుని హరిత గ్రామంలోని ఓ ఇంటి వద్ద తరగతులు ప్రారంభించారు. రెండు రోజుల కిందట భవానీ, అయ్యప్పదీక్షలు వేసేందుకు సిద్ధం కావడంతో ఇంటిని అప్పాజెప్పాలని యజమాని సూచించడంతో ఉపాధ్యాయుని అదే ఇంటి బయట ఉన్న చెట్టు కింద పాఠాలు బోధిస్తున్నారు.
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు దసరాల సెలవులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ కోర్సులను అందిస్తున్న అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించింది. మరళా ఈ నెల 21న తరగతులు పునఃప్రారంభంకానున్నాయని పేర్కొంది. సెలవుల్లో ప్రత్యేక క్లాసులు, శిక్షణ అంటూ తరగతులు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఇంటర్బోర్డు జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ స్పష్టం చేశారు.
‘సాంకేతికతతో తపాలా సేవలు సులభతరం’
శ్రీకాకుళం అర్బన్: మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా సేవలను సులభతరం చేస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో అక్టోబరు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఒకే తపాలా నెట్వర్క్–అనంతమైన అవకాశాలు అనే ప్రధాన అంశంతో ఈ వేడుకలు సాగుతాయని స్పష్టం చేశారు. 12న తపాలా బిళ్లల సేకరణపై అవగాహన దినోత్సవం, 13న ఆర్థిక సమ్మేళితత్వం, పౌర కేంద్రీకృత సేవల దినోత్సవం, 14న మెయిల్స్, పార్సిళ్ల దినోత్సవం, 15న సాంకేతికత, ఆవిష్కరణల దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.


