● గెలుపొందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు
పోలాకి: ఈదులవలస ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అధికార పార్టీ ప్రయోగించిన కుయుక్తులేవీ పనిచేయలేదు. విద్యాకమిటీ ఎన్నిక రాజకీయం చేయటంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల మోహరింపు, తల్లిదండ్రులకు తాయిళాలు ఆశచూపటం వంటివి చేసినా తల్లిదండ్రులు మాత్రం విచక్షణతో ఓటేశారు. గతసారి కోరం లేకపోవటంతో వాయిదాపడిన ఎన్నిక శుక్రవారం 333 మంది తల్లిదండ్రుల హాజరుతో ఎన్నిక నిర్వహించారు. ప్రిన్సిపల్ పి.ప్రవీణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో 15మంది సభ్యులకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు గెలుపొందటం విశేషం. ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, ఐదుగురు ఎక్స్అఫీషియో సభ్యులను ఎన్నుకుని చైర్మన్గా మెండ తాతమ్మ, వైస్ చైర్మన్గా కొంగరాపు గణేష్లు అధ్యక్షతన తొలి కమిటీ సమావేశం సైతం నిర్వహించారు. వీరిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. అంతకుముందు చైర్మెన్, వైస్ చైర్మెన్లు ఈదులవలస గ్రామపెద్ద ముద్దాడ భాస్కరనాయుడు ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మండలపరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కణితి కృష్ణారావు, యువజన నాయకుడు బోర హాటకేసం(బుజ్జి), ఎస్సీసెల్ అధ్యక్షుడు కల్లేపల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.


