అటవీ శాఖలో అలసత్వం! | - | Sakshi
Sakshi News home page

అటవీ శాఖలో అలసత్వం!

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

అటవీ శాఖలో అలసత్వం!

కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో కమ్ముకున్న స్తబ్ధత ప్రశ్నార్థకంగా నగరవనం నిధుల వినియోగం

మొక్కల జాడపై నోరుమెదపని అధికారులు

పనిచేయని నంబర్‌..

కాశీబుగ్గ:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన సంరక్షణ, హరితహారం ‘నగరవనం’ పథకాలు క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్నాయి. ఒకవైపు పచ్చదనాన్ని పెంపొందించడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే.. మరోవైపు కొందరు అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇందుకు కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో అధికారుల తీరే అద్దం పడుతోంది.

నగరవనం నిధులేమైనట్లు?

కాశీబుగ్గ రేంజ్‌ పరిధిలో ‘నగరవనం’ కింద ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఏకంగా 5 వేల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ, ఆ మొక్కలు ఎక్కడ నాటారు? వాటి రక్షణ పరిస్థితి ఏమిటి? అని స్థానికులు లేదా బాధ్యులైన అధికారులను ప్రశ్నిస్తే ఎవరి నోటా సరైన సమాధానం రావడం లేదు. సుమారు 5 వేల మొక్కల కొనుగోలు, గుంతల తవ్వకం, నాటే ప్రక్రియ అంతా కాగితాలకే పరిమితమైందా? లేదా నిధులు మాత్రమే డ్రా చేసుకొని క్షేత్రస్థాయిలో మొక్కలను గాలికి వదిలేశారా? అనేదానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల్లో అవగాహన లోపం..

గడిచిన ఏడాది కాలంలో వన సంరక్షణ, నగరవనం కింద చేపట్టిన కార్యక్రమాలపై కనీస సమాచారంపై ఏ ఒక్క అధికారికీ అవగాహన లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రేంజ్‌ పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలపై ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి రాజు (ఎఫ్‌ఎస్‌ఓ) వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తన దగ్గర వివరాలు లేవని చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ’నగరవనం’ నిధుల ఖర్చు, నాటిన మొక్కల వాస్తవ పరిస్థితిపై బహిరంగ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల్లో సమన్వయలోపం..

బెండిగేటు నుంచి ఇచ్ఛాపురం వరకు కాశీబుగ్గ రేంజ్‌ పరిధిలోకి వస్తుంది. ఈ పరిధిలో మొత్తం 17వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. మొత్తం ఐదుగురు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, తొమ్మిదిమంది బీట్‌ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. తొమ్మిదిమంది అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లకు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాగా ప్రస్తుతం ఎవరు విధుల్లో ఉన్నారో

తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయాన్ని సంప్రదించాలంటే 9440810208 అనే నంబరుకు ఫోన్‌ చేయాల్సిందిగా అధికారికంగా సూచించారు. కానీ ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే పనిచేయని పరిస్థితి. ట్రూ కాలర్‌లో మాత్రం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌, కాశీబుగ్గ అని సూచిస్తోంది. కార్యాలయానికి సంబంధించిన ఫోన్‌ పనిచేస్తుందో? లేదో? తెలుసుకోలేని పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement