శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లను 60 డివిజన్లుగా పున ర్విభజన చేసేందుకు కార్పొరేషన్ అధికారులు మల్లగుల్లాలు పడి గురువారం రాత్రి 10 గంటలకు పూర్తిచేశారు. తక్కువ సమయం ఇచ్చి డివిజన్ల పునర్విభజన చేయడంతో ఏ ప్రాతిపదికన చేశారో.. ఎలా చేశారో.. ఎవరికి నష్టం జరుగుతుందో.. ఎవరికి లాభం చేకూరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 14లోగా లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని అధికారులు ప్రకటించారు. జీవో ఎంఎస్ నెంబర్ 64 ప్రకారం 2026 మార్చి 24ను అనుసరించి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్క్యులర్ ప్రకారం 50 డివిజన్లను 60 డివిజన్లగా మార్చే ప్రక్రియ చేపట్టినట్లు కమిషనర్ జి.శ్రవణ్కుమార్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీవో, మండల తహశీల్దార్ కార్యాలయం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, మండల పరిషత్ అధికారి, శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, కలెక్టర్ కార్యాలయం వద్ద పునర్విభజన కాపీలు అందుబాటులో ఉంటాయని, అభ్యంతరాలు ఉంటే ఆయా అధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ జానకి, వెంకటేశ్వరరావు, ఎంఈ రవిశర్మ, టీపీపీఓ స్వరూప్ పాల్గొన్నారు.


