మెంథా సాయం
ఎక్కడ..?
వర్షాల నష్టాలపై రైతులకు అందని పరిహారం
సర్వేలతోనే కాలయాపన చేస్తున్న వైనం
ఇంకా అందని గతేడాది మోంథా తుఫాన్ సాయం
ఇటీవల మళ్లీ భారీగా పంటనష్టం
నష్టాల్లో కూరుకుపోయిన అన్నదాత
రిహాసం..!
ఇచ్ఛాపురం రూరల్:
ప్రకృతి ప్రకోపానికి పంటలు నేలపాలై.. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వర్షాలు కారణంగా వందల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలు వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నప్పటికీ.. పరిహారం ఎప్పుడు అందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో బాధిత రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు వేగవంతంగా పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇటీవల వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మండలం పరిధిలో 155.26 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిళ్లిగా.. 991 మంది రైతులు ప్రభావితమయ్యారు. ఇందులో తులసిగాం పంచాయతీ పరిధిలోనే అధికంగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ నష్టాలకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత కొరవడడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
సర్వేలకే పరిమితమా..?
భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింది..? ఎంతమంది రైతులు నష్టపోయారనే వివరాలను సేకరిస్తున్నారు. అయితే సర్వేలు పూర్తవుతున్నా.. రైతులకు పరిహారం అందుతుందా..? అందితే ఎప్పుడు అందుతుంది అనే ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చయడం ఎలాగో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2025 అక్టోబర్ 28న వచ్చిన మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇచ్ఛాపురం మండలంలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వరద నీటితో 98.19 హెక్టార్లలో పంట ముంపునకు గురయ్యిందని, 555 మంది రైతులు పంట నష్టపోయారని అప్పట్లో వ్యవసాయాధికారులు సర్వే చేసి తేల్చారు. నష్టం వివరాలను నమోదు చేసి దాదాపు ఏడాది పూర్తయినప్పటికీ బాధిత రైతులకు పరిహారం అందడంలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీంతో సాయం అందజేయడం ప్రభుత్వం మరిచిపోయిందని రైతులు వాపోతున్నారు. గతేడాది మోంథా తుఫాన్ నష్టానికి సంబంధించిన పరిహారమే అందని పరిస్థితిలో.. తాజా నష్టానికి పరిహారం ఎప్పుడు వస్తుందోనని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా గతేడాది తుఫాన్ నష్టానికి సంబంధించిన పరిహారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు.. తాజాగా వర్షాల ప్రభావంతో పంట నష్టానికి కూడా సత్వరమే ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నాకు చెందిన రెండు ఎకరాల 70 సెంట్ల పంట పూర్తిగా దెబ్బతింది. గత మోంథా తుఫాన్లోనూ ఇదేవిధంగా నష్టపోయాను. అప్పట్లో అధికారులు వచ్చి సర్వే చేసి వివరాలు నమోదు చేశారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా అందలేదు. సర్వేలు చేయడం కాదు.. నష్టపోయిన నాలాంటి వందలాది మంది రైతులకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలి.
– ఇసురు రాజారావు రెడ్డి,
రైతు, ఇన్నేశుపేట
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని తులసిగాం, లొద్దపుట్టి, రత్తకన్న, మండపల్లి, ధర్మపురం ప్రాంతాల్లో 382 ఎకరాల్లో 991 మందికి చెందిన రైతుల పంట పోయినట్లు సర్వేలో తేల్చాము. నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. గతేడాది మోంథా తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతులు వివరాలు నమోదు చేసి అప్పుడు సమర్పించడం జరిగింది. పంట నష్ట పరిహారం అనేది జిల్లాస్థాయి ఉన్నతాధికారుల చేతుల్లో ఉంటుంది.
– పీపీవీవీ అజయ్కుమార్,
వ్యవసాయాధికారి, ఇచ్ఛాపురం


