తప్పుడు వివరాలు నమోదు
తక్కువగా నమోదు
● తప్పుల తడకగా రీసర్వే ● అనేకచోట్ల తప్పుడు వివరాలు నమోదు ● గోకర్ణపురంలో లబోదిబోమంటున్న రైతులు
కంచిలి: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా చేపట్టాల్సిన భూముల రీసర్వేలో చాలాచోట్ల రైతుల వివరాలు తప్పుల తడకగా నమోదు చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు భూయజమానులు బలవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా భూముల వివరాలు నమోదు చేసే సమయంలో రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు పలుచోట్ల అందుబాటులో లేనప్పుడు తప్పుడు వివరాలతో నమోదులు జరిగాయి. అవి ఇప్పుడు పాస్‌బుక్‌లలో తప్పుగా ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత సరిచేయడానికి అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈ పరిిస్థితి కనిపిస్తుంటే.. వాటిని సరిచేసేందుకు మ్యుటేషన్లు పెట్టుకోమని అధికారులు సూచిస్తున్నారు.
గోకర్ణపురంలో 80 శాతం తప్పులు
కంచిలి మండలంలోని గోకర్ణపురంలో పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామంలో 80 శాతం మంది భూయజమానులకు ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లు తప్పుగా నమోదయ్యాయి. దీనికి కారణం రీసర్వే సమయంలో అక్కడ విధులు నిర్వహించిన గ్రామ సర్వేయర్ చేసిన పొరపాట్లేనని తేలింది. వాటన్నింటినీ పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ తప్పులు కనిపెట్టకపోవడంతో ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. రీసర్వే ప్రక్రియ పూర్తవ్వడంతో ఈ పంచాయతీ పరిధిలో 912.58 ఎకరాల జిరాయితీ భూములకు సంబంధించి 784 మంది రైతులకు తాజాగా పట్టాదారు పాస్ పుస్తకాలు విడుదల చేశారు. ఇందులో 80 శాతం పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువ ఉన్న వాళ్లకు తక్కువగా, ఒకరికి బదులు మరొకరు ఫొటోల ముద్రణ, ఆధార్ కార్డు నంబర్లు, ఫోన్ నంబర్లు తప్పుగా నమోదు చేయడం దర్శనమిచ్చాయి. దీంతో గ్రామస్తులు సమస్యను మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుటికీ పరిష్కారం కాలేదు. ఇక చేసేదేమీలేక కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలాస ఆర్డీవో అప్పలరాజు బుధవారం గ్రామానికి విచ్చేసి ఇక్కడ సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించారు. ఈ తప్పిదాలకు కారణంగా గుర్తించిన అప్పటి గ్రామ సర్వేయర్ సుందర్పైన అప్పటి ఆర్డీవో క్రమశిక్షణా చర్యలు చేపట్టారని తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ వివరించారు. తర్వాత పక్క సచివాలయాల నుంచి సిబ్బందితో మిగతా పనులు చేపట్టామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగిన తప్పులను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి జరిగిన తప్పులన్నింటినీ విచారించారు. పరిష్కారానికి త్వరితగతిన కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత దుర్గాసి మాధవరావు మాట్లాడుతూ.. పాస్‌బుక్‌లలో తప్పులు సరిచేసి, భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
మాకు చెందిన 5 ఎకరాల భూమిని మా తల్లి శీర పద్మతోపాటు అన్నదమ్ములు శీర ప్రకాశం, నాగేశ్వరరావులకు వాటాలుగా వేసుకున్నాం. కానీ మాకు వేర్వేరుగా వచ్చిన పాస్‌బుక్‌లలో విస్తీర్ణాలు తప్పుగా నమోదయ్యాయి. పైగా నా తల్లి పద్మ ఫొటోకు బదులుగా వేరే మగవ్యక్తి ఫొటోను ముద్రించారు. దీనివలన ఆందోళన చెందుతున్నాం.
– శీర ప్రకాశం, రైతు, గోకర్ణపురం
నాకు రెండుచోట్ల ఉన్న భూమిలో తక్కువగా విస్తీర్ణాలు నమోదు చేశారు. ఒకచోట 17 సెంట్లు, మరోచోట 13 సెంట్లు తక్కువగా పాస్ పుస్తకంలో ప్రింట్ చేశారు. అదేవిధంగా నా కుమారునికి ఇచ్చిన పాస్‌బుక్‌లలో కూడా తక్కువ విస్తీర్ణాలు నమోదయ్యాయి. వాటన్నింటినీ సరిచేయాలి.
– టెంక పురుషోత్తం,రైతు, గోకర్ణపురం


