అండర్‌–16 క్రికెట్‌ జట్టుకు సాత్విక్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–16 క్రికెట్‌ జట్టుకు సాత్విక్‌ ఎంపిక

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

నరసన్నపేట: న్యూ చండీఘడ్‌లో ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న అండర్‌–16 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు రాష్ట్ర జట్టును క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దీంట్లో నరసన్నపేట క్రికెట్‌ సబ్‌ సెంటర్‌కు చెందిన శిమ్మ సాత్విక్‌కు స్థానం లభించింది. ఇప్పటికే పలు మ్యాచ్‌ల్లో సాత్విక్‌ ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబర్చాడు. రాష్ట్ర క్రికెట్‌ జట్టులో తనకు స్థానం లభించడంపై సాత్విక్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాగా బుధవారం సాత్విక్‌ విజయనగరం చేరుకొని అక్కడ నుంచి న్యూ చండీఘడ్‌కు పయనమవ్వనున్నాడు. సాత్విక్‌ను స్థానిక వైఎంసీఏ ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, సబ్‌ సెంటర్‌ కోచ్‌ శ్రీనివాస్‌లు అభినందించారు.

ఆర్మీ జవాన్‌కు ఘన సన్మానం

సంతబొమ్మాళి: భారత సైన్యంలో 24 ఏళ్లపాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొంది సొంత గ్రామం కాపుగోదాయవలస విచ్చేసిన జవాన్‌ వాడరేవు రాజు(హవల్దార్‌)ను గ్రామస్తులు బుధవారం ఘనంగా సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని హెల్పింగ్‌ హ్యాండ్స్‌ గ్రూప్‌ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అంగ లక్ష్మి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

పనులు నిలుపుదల చేయండి

జి.సిగడాం: మండలంలోని పున్నాం పంచాయతీలో మైనింగ్‌ పేరుతో వేదంతా గ్రూపు సంస్థ సిబ్బంది లేనిపోని సర్వేలు చేస్తుండడం వలన ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారని, తక్షణమే వేదంతా కంపెనీ ఎటువంటి పనులు జరపకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ పరిధిలోని బూటుపేట, ఎల్లయ్యపేట, ఉల్లివలస, డీఆర్‌వలస గ్రామస్తులు కోరారు. ఈ మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నుడకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులను బుధవారం కలిసి వినతిపత్రాలు అందించారు. తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూమి పోతే ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందించామన్నారు.

అగ్ని ప్రమాదంలో షాపు దగ్ధం

సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దివ్యాంగుడు కర్రి నాగరాజుకు చెందిన షాపు దగ్ధమై సుమారు రూ.2 లక్షల మేర నష్టం సంభవించింది. ప్రమాదంలో ఆయన దాచుకున్న నగదుతో పాటు బడ్డీలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంటరిగా జీవిస్తున్న కర్రి నాగరాజు ఇంటి వద్దనే షాపు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో షాపులోని సామగ్రితో పాటు తాను దాచుకున్న రూ.1.20 లక్షల నగదు అగ్నికి ఆహుతైంది. దీంతో దాదాపు రూ.2 లక్షల మేర నష్టం జరిగిందని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఉమాపతి, వీఆర్వో జోగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

37 గొర్రెలు, మేకలు మాయం

మందస: మండలంలోని బాలాజీపురం గ్రామంలో దొంగలు బుధవారం వేకువజామున 37 గొర్రెలు, మేకలు ఎత్తుకుపోయారు. గ్రామానికి చెందిన తనగాన బాలరాజు తన ఇంటి దగ్గరలోని పశువుశాలలో మంగళవారం సాయంత్రం మేకలు, గొర్రెలు ఉంచి తన ఇంటికి వెళ్లాడు. పశువుల శాల చుట్టూ ఇనుప కంచి వేసి జీవాలను ఉంచారు. అయితే బుధవారం ఉదయం లేచి చూసేసరికి మందలో 37 మేకలు, గొర్రెలు కనిపించకపోయే సరికి బాలరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం రూరల్‌: ఏపీ స్టేట్‌ ఎలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ వారు డిప్లమో ఎలైడ్‌ హెల్త్‌కేర్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వ్‌రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement