సెటిల్మెంట్లకు అడ్డాగా..! | - | Sakshi
Sakshi News home page

సెటిల్మెంట్లకు అడ్డాగా..!

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

కాశీబుగ్గ:

పలాస – కాశీబుగ్గ జంట పట్టణాల్లో కొన్ని లాడ్జిల నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి వారొస్తున్నారు..? వారి నేపథ్యమేంటి..? అనే వివరాలను ఆరా తీయడాన్ని నిర్వాహకులు విస్మరిస్తున్నారు. ఉన్న గదులన్నీ కస్టమర్లతో నిండి తమకు డబ్బులు వస్తే చాలనే ధోరణి అవలంబిస్తున్నారు. వీటిపై నిరంతర నిఘాతో పర్యవేక్షించాల్సిన పోలీసు శాఖ నామమాత్రంగా వ్యవహరిస్తోంది. అనుకోని సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే సందర్భంలో మాత్రం హడావుడిగా చర్యలు చేపట్టడం, ఆ వాతావరణం చల్లారాక మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదాయార్జనే ధ్యేయంగా..?

జంట పట్టణాల్లో ప్రధానంగా ఐదు లాడ్జిలున్నాయి. ఇవన్నీ జన సమ్మర్థ ప్రాంతాల మధ్యే ఉన్నాయి. వీటిలో బస చేసేవారిని చూస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లే తారసపడుతుంటారు. మన రాష్ట్రానికి చెందినవారు అరుదుగా కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు సెటిల్మెంట్‌ దందాలు, మధ్యవర్తిత్వ తగాదాలకు పరిష్కార వేదికలవుతుంటాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాళ్లు ఏ ఉద్దేశంతో బస చేస్తున్నారు..? అందుకు కారణాలేంటో నిర్వాహకులు తెలుసుకోవడం లేదు. నిరంతరం పర్యవేక్షించాల్సిన పోలీసులు నామమాత్రపు తనిఖీలతో కాలం నెట్టుకొస్తున్నారు. తగిన సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాలతో తనిఖీలను కానిచ్చేస్తున్నారు. ఇంకొందరు అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాడ్జిలకు సంబంధిత మున్సిపల్‌, స్థానిక సంస్థల నుంచి లైసెన్స్‌, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం అవసరం. అలాగే పర్యాటక శాఖనుంచి సైతం రిజిస్ట్రేషన్‌ పొందాలి. కానీ పర్యాటక శాఖ నుంచి చాలా లాడ్జిలకు రిజిస్ట్రేషన్‌ లేదన్నది అక్షర సత్యం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక లాడ్జి నిర్వహణకు అవసరమైన అన్ని లైసెన్సుల్లో ఏ ఒక్కటి లేకున్నా భారీగా జరిమానా విధించాలి. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఉన్నవాటిలో సరిగా తనిఖీలు చేపడితే చాలావరకు జరిమానాలు వేయాల్సిందే. కానీ ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

హత్య జరిగిన

కాశీబుగ్గలోని ఒక లాడ్జి

హత్యకు గురైన మహిళ(ఫైల్‌)

అఘాయిత్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా పలు లాడ్జిలు

తరచూ వివాదాలు

మామూళ్ల మత్తులో అధికారులు

నామమాత్రపు తనిఖీలతో నిఘా కరువు

ఇటీవల సెప్టెంబర్‌ 30న జరిగిన హత్యోదంతం నేపథ్యాన్ని పరిశీలిస్తే.. లాడ్జిల నిర్వాహకులు కేవలం డబ్బులొస్తే చాలన్నట్లుగా వ్యవహరించినట్లు ప్రస్ఫుటమవుతోంది. హతురాలిని తీసుకొచ్చిన అగంతకుడిపై సరైన నిఘా వేసి ఉంటే ఓ నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉండేది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఐదుగురు పిల్లలకు తల్లిలేని లోటును మిగిల్చింది.

అరకొర వివరాలతో గదిచ్చారు

గది తీసుకునేందుకు వచ్చిన వారిలో ఎవరిదో ఒకరిది మాత్రమే గుర్తింపు కార్డు తీసుకుంటున్నారు. అలాకాకుండా ఇద్దరు.. అంతకంటే ఎక్కువమంది వచ్చేటప్పుడు అందరి గుర్తింపు కార్డులను తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలతో వచ్చే పురుషుల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. కానీ ఈ అఘాయిత్యంలో లాడ్జి నిర్వాహకులు హంతకుడి ఆధార్‌ తీసుకోలేదు. హతురాలి ఆధార్‌తో సరిపెట్టారు. తన ఆధార్‌ ఇమ్మంటే లేనిపోని సాకులతో తప్పించుకున్నాడు. అలాంటప్పుడే నిలదీసి ఉంటే ఈ ఘాతుకానికి ఆస్కారం ఉండేది కాదు. అలాగే లాడ్జి ఆవరణలో క్షణక్షణం ఏం జరుగుతుందనే కదలికలపై సీసీ టీవీతో పర్యవేక్షించాలి. వాస్తవానికి లాడ్జిలో సీసీ టీవీ ఉంది. కానీ నిందితుడు మహిళను వెంటబెట్టుకొని మాస్కుతో వచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న సిబ్బంది ఆ మాస్కును తొలగించమనలేదు. పైగా ప్లాన్‌ ప్రకారం మహిళను మట్టుబెట్టి ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరిగి మాస్కుతోనే బయటికి వచ్చి పరారయ్యాడు. ఆ సమయంలోనైనా మాస్కును తొలగించమని లాడ్జి నిర్వాహకులు అడగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement