గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

కాలువపై పలకల ఏర్పాటు

చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల కల్యాణ్‌ (26) గల్లంతయ్యాడు. ఆయన సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి, సోమవారం రెస్క్యూటీం రిజర్వాయర్‌లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం జలాశయంలో మృతదేహం తేలినట్లు సర్పంచ్‌ మాలోత్‌ నవీన్‌నాయక్‌కు గ్రామస్తులు తెలపడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

టెక్కలి: టెక్కలి వైఎస్సార్‌ జంక్షన్‌ సమీపంలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో కాలువపై ఎట్టకేలకు సిమెంట్‌ పలకలను అమర్చారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిలో కాలువ పైకప్పులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారంటూ మంగళవారం ‘సాక్షి’లో ‘చివరి మజిలీకి చిక్కులు’ అనే కథనం వెలువడిన సంగతి విదితమే. దీనిపై పంచాయతీ యంత్రాంగం స్పందించి కాలువ పైకప్పులను అమర్చారు.

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం యలమంచలి పంచాయతీ రాయపాడు గ్రామానికి చెంది తాపీమేసీ్త్ర పైల సూర్యనారాయణ(50) విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యనారాయణ మంగళవారం తన గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. రెండో ఫ్లోర్‌లో పనులు చేస్తుండగా 12కేవీ విద్యుత్‌ లైన్‌ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు.అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూర్యనారాయణకు భార్య ఉత్తరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లయినా ఇప్పటికీ నాయీ బ్రాహ్మణులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, గ్రామాల్ని విడిచి పట్టణాల్లో కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి కారణం పాలకవర్గాలే అని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొరుపూరు గజపతిరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో జ్యోతిరావుపూలే కాలనీ (కంపోస్టు) నాయీబ్రాహ్మణ కుల సంఘ కార్యాలయంలో నాయిబ్రాహ్మణ కుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌.సదాశివంను మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా గజపతి మాట్లాడుతూ వెనుకబడిన చాలా కులాలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తున్నా తమకు ఎందుకు వర్తింపజేయడం లేదో తెలియడం లేదన్నారు.

కలెక్టర్‌తో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యవర్గం భేటీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం 2026–2029 కాలపరిమితికి రాష్ట్ర కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లా తరఫున రణస్థలం తహసీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే విధంగా, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గం 2026–2029లో ప్రచార కార్యదర్శిగా సరుబుజ్జిలి వీఆర్వో గంగు డిల్లేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ)లను రెవెన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement