విధులు బహిష్కరించి ఆందోళన
రోగులకు తప్పని ఇక్కట్లు
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణం రెగ్యులర్ చేయాలని శ్రీకాకుళం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించి వైద్య కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. వీరికి సంఘీభావం తెలిపిన సాయిరాం మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనబాట పడతామని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే వారంతా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు వేదవతి లక్ష్మీబాయి మాట్లాడుతూ ప్రభుత్వం మూడుసార్లు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపిందని, ప్రతిసారి ఆర్థికపరమైన విషయాలు మాట్లాడవద్దని చెప్పడం సరికాదన్నారు. జేఏసీ జిల్లా నాయకుడు అశోక్ మాట్లాడుతూ రిమ్స్ రోగులు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ సేవలకు హాజరవుతున్నామని, ప్రభుత్వం ఇదే మొండివైఖరిని అవలంబిస్తే ఎమర్జెన్సీ సేవలను సైతం బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో పాటు 500 మందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నారు
రోగులకు అవస్థలు..
కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టడంతో రిమ్స్క వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ సేవల దగ్గర నుంచి పరీక్షలు జరిపే వరకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొందరు రోగులు నిరీక్షించలేక ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టారు. వార్డుల్లో కూడా ఇన్పేషెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.


