● అరసవల్లి ఆదిత్యాలయంలో ఘటన ● మండిపడుతున్న భక్తులు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రంలో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మిగిలినపోయిన అన్నప్రసాదాలను ఆవులకు తినిపించడంతో రెండు గోవులు డయేరియాతో మృత్యువాత పడగా, నిన్న ప్రసాదాల విక్రయాల్లో జిగురు కారుతున్న లడ్డూలను భక్తులకు అమ్మేసి ఆలయ అధికారులు తీవ్ర విమర్శలు పాలయ్యారు. తాజాగా నిత్యం ఆలయ పరిసరాలను చీపురు పట్టుకుని తుడిచే స్వీపర్లతో గత కొన్నిరోజులుగా పవిత్రమైన ఉచిత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎదురైన ఈఘటనతో ఒక్కసారిగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దినసరి వేతనం కింద పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్న స్వీపర్లకు వారి విధులతో పాటుగా అదనంగా ఉచిత ప్రసాదాల పంపిణీ విధులను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలకు దెబ్బతినేలా ఇలాంటి చర్యలతో ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఇదే ఆలయంలో ఉచిత ప్రసాదాలను బ్రాహ్మణ సిబ్బందికి లేదా సేవ సంఘ సభ్యులకు అప్పగించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. స్వీపర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రసాదాల పంపిణీ బాధ్యతలను అప్పగించడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ‘తమకేమీ తెలియదని..అధికారులు ఏం చెప్తే అది చెయ్యడమే మా పని అంటూ...’ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


