బాలింత మృతిపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బాలింత మృతిపై ఆందోళన

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

● ఆపరేషన్‌ వికటించడం వల్లేనంటున్న కుటుంబ సభ్యులు

● ఆపరేషన్‌ వికటించడం వల్లేనంటున్న కుటుంబ సభ్యులు

నరసన్నపేట : ఆపరేషన్‌ వికటించడం వల్ల బాలింత మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్‌ మండలం బైరివానిపేటకు చెందిన బుద్దల దివ్య(24) రెండో కాన్పు కోసం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో ఈ నెల ఒకటో తేదీన జాయిన్‌ చేశారు. అదే రోజు ఆపరేషన్‌ చేశారు. సీ్త్ర వైద్య నిపుణురాలు కృషి పక్కనే ఉండి పీజీ చేస్తున్న వైద్యులతో ఈ ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్‌ వికటించడంతో గర్భంలోనే రక్తం ధారలుగా పోయింది. అప్పటికప్పుడు మూడు ప్యాకెట్ల రక్తం ఎక్కించారు. అయినా పరిస్థితి మారకపోవడంతో వైద్యుల సూచన మేరకు రిమ్స్‌కు రెండో తేదీన తరలించగా మళ్లీ అక్కడ ఆపరేషన్‌ చేశారు. ఈ క్రమంలో దివ్య మృతి చెందింది.

దివ్య మృతికి ఆపరేషన్‌ వికిటించడమేనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. దివ్య కన్నవారి ఊరు బుడితి వద్ద అవలింగి కావడంతో మొదటి కాన్పు నుంచీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కృషి వద్దే చికిత్స చేయిస్తున్నామని, రెండో కాన్పుకూ ఇక్కడికే తీసుకురావడం తమ కొంప ముంచిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ప్రైవేటు క్లినిక్‌ వద్ద ఉద్రిక్తత..

బైరివానిపేటకు చెందిన దివ్య బంధువులు, కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయానికే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు నిర్వహించే ప్రైవేటు క్లినిక్‌ వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌, పోలాకి ఎస్సై రంజిత్‌, సిబ్బంది వచ్చి బంధువులకు నచ్చచెప్పారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు మధ్యవర్తిత్వం నడిపి నష్టపరిహారం ఇప్పించేందుకు సంప్రదింపులు చేసినా బెడిసికొట్టినట్లు సమాచారం.

అప్పుడప్పుడు జరుగుతుంటాయి.

వంద కేసుల్లో ఒకటో రెండో ఇలా జరుగుతుంటాయని, అలాగని వైద్యులపై నిందలు వేయడం, ఆందోళనకు దిగడం సరికాదని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనుబాబు అన్నారు. డాక్ట కృషి సీనియర్‌ వైద్యురాలని, ఇకపై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement