బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

● సుప్రీంకోర్టుకు వెళ్తామనడం కాలయాపనే

● మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస: బీసీల రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరతీస్తోందని మాజీ స్పీకర్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆయన శుక్రవా రం ఆమదాలవలసలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓలను హైకోర్టు కొట్టివేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ దీనిపై మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్తామనడం పరిష్కా రం కాదని, కోర్టులో నిలబడని జీఓలను జారీ చేసి, ఆ తర్వాత కోర్టే అడ్డుకుందని చెప్పడం ద్వారా బీసీలకు ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామే అధికారంలో ఉందని రాజ్యాంగపరమైన, చట్టపరమైన మార్పుల కోసం చర్చించాలని సూచించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో బీసీలకు కేవలం చట్టబద్ధమైన రిజర్వేషన్లకే పరిమితం కాకుండా రాజకీయ ప్రాతినిధ్యంలోనూ ప్రాధాన్యం కల్పించారని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన తనను శాసనసభ స్పీకర్‌గా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి వైఎస్‌ జగన్‌ తనకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తమ్మినేని తెలిపారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో సమస్య వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని తమ్మినేని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ముందుకు రావాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

బీసీల జీవితాలతో ఆటలు వద్దు..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు నిజంగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే న్యాయపరంగా బలమైన చర్యలు తీసుకోవాలని తమ్మినేని అన్నారు. కోర్టు అడ్డుకుంది.. విపక్షం అడ్డుకుంది అంటూ నిందలు వేస్తే ప్రయోజనం లేదన్నారు. కోర్టులో నిలబడని జీఓలను చూపించి బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement