శ్రీకాకుళం పాతబస్టాండ్: నీట్ పీజీ–2026 పరీక్షలకు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. గతంలో కేటాయించిన మూడు కేంద్రాలతో పాటు కొత్తగా టెక్కలిలోని ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ను కూడా పరీక్ష కేంద్రంగా చేర్చడంతో జిల్లాలో మొత్తం కేంద్రాల సంఖ్య 4కు చేరిందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చిలకపాలెం జంక్షన్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పక్కన, నరసన్నపేట లోని కోర్ టెక్నాలజీస్ మారుతీ నగర్–2 తో పాటు కొత్తగా టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఈ కేంద్రాల పర్యవేక్షణకు శ్రీకాకుళం ఆర్డీవోతో పాటు టెక్కలి ఆర్డీవోను సూపర్‌వైజరీ అధికారిగా, టెక్కలి ఆర్‌ఎస్‌డీటీని నోడల్ అధికారిగా నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రతతో పాటు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షలకు పంపుతారని, అభ్యర్థులు ఈ విషయంలో సహకరించాలని కోరారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు.


