శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో ఆటోలో ప్ర యాణిస్తున్న వృద్ధ దంపతుల బ్యాగులో దాదాపు 29 గ్రాముల బంగారు ఆభరణాలున్న పర్సును కొట్టేసిన దొంగలను రెండో పట్టణ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులిద్దరూ తిరుప తి జిల్లా గూడూరు గాంధీనగర్‌కు చెందిన అమావాస్య మణికంఠ, సుక్కు విజయ్ అని, విచారణ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 16న పాతబస్టాండు సమీప మేదరవీధికి చెందిన అప్పారావు దంపతులు ఆటోలో ఎక్కడం గమనించిన మణికంఠ, విజయ్‌లు పాతబస్టాండ్ వద్దే అదే ఆటోలో ఎక్కారు. వృద్ధులు పెట్టిన బ్యాగు పైనే తమ బ్యాగు పెడుతూ మెల్లగా వృద్ధుల బ్యాగులో చేయి పెట్టి బంగారు పర్సు తీసేశారు. కాంప్లెక్స్ సమీపంలో దిగి బ్యాగు చూసేసరికి 24.26 గ్రాముల పుస్తెల తాడు, 4.20 గ్రాముల చెవిదిద్దులున్న పర్సు లేకపోవడంతో మరుసటి రోజు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వృద్ధు లు ఆటోలో ప్రయాణించిన సమయాన్ని బట్టి కృష్ణాపార్కు సమీపంలో మ్యాట్రిక్స్ సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. గురువారం నగరంలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన మణికంఠపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కేసులున్నాయని, ఇటీవలే తెలంగాణ మెహబూబాబాద్ జిల్లాలో ఓ చోరీ చేశారని తె లిపారు. ఆటోల్లో ప్రయాణించే వృద్ధుల వద్ద బంగారం దోచేయడమే వీరి నైజమని సీఐ పేర్కొన్నారు.


