శ్రీకాకుళం న్యూకాలనీ, ఎచ్చెర్ల: ప్రభుత్వ ఐటీఐల్లో ఒకటి, రెండు, మూడు విడతల ప్రవేశాల సందర్భంలో వివిధ కారణాలతో ప్రవేశాలు పొందని విద్యార్థులకు డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ తీపికబురు చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరంలో నాల్గో విడతలో ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 31వ తేదీన ఉదయం 11.30 గంటల్లోపు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం 11.30 నుంచి ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐ శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ జరగనుంది. శ్రీకాకుళం డీఎల్‌టీసీలో డ్రాఫ్ట్‌మెన్ సివిల్, కోపా, సూయింగ్ టెక్నాలజీ(టైలరింగ్) (మహిళలకు మాత్రమే) ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయని, వెంటనే విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌టీసీ ఏడీ వి.రఘురాం తెలిపారు.
31న శ్రీకాకుళం ఆర్ట్స్
కళాశాలలో మెగా జాబ్‌మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలలోని నోడల్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో ఈనెల 31వ తేదీన మెగా జాబ్‌మేళా జరగనుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నంద సూర్యనారాయణ స్వామి, జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి.పైడితల్లి పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, ఇసుజు మోటర్స్, ఎల్‌అండ్‌టీ, వి ప్రో, అరబిందో అపిటోరియా, టాటా ఎలక్ట్రానిక్స్, హీరో, హెట్రో, న్యూ లాండ్ లేబరేటరీస్, కియా, అపోలో టైర్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్, డాయ్‌కిన్, గోద్రేజ్, ఫోఫ్క్సోన్ తదితర కంపెనీల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్, డిప్లమో, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో విద్యార్హతలు కలిగి 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9553994923, 9440425606 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్య ర్థులు ఆ శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 27వ బ్యాచ్ అభ్యర్థులకు సర్టిఫికెట్స్‌ను శుక్రవారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అందజేసి అభినందనలు తెలిపారు. తదుపరి 28వ బ్యాచ్‌లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని అప్పలనారాయణ తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 ఏళ్లు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులన్నారు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందన్నారు. ఫీజు, ఇతర వివరాలకు 9390886033 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.


