రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్ ఎన్‌హెచ్–16పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఐసర్ వ్యాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో రణస్థలం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ఐసర్ వ్యాన్ రోడ్డు దాటుతున్న గొర్లె తేజేశ్వరరావు (55) అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిది సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామం. మృతుడి భార్య ఇటీవల చనిపోవడంతో లావేరు మండలంలోని బుడతవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె దగ్గర గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కుమార్తె ఇంటి దగ్గర బయల్దేరి సిరిపురం వెళ్తూ బెజ్జిపురం కూడలికి వచ్చారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లావేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుని వివరాలు సేకరించారు. ఎస్‌ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


