రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ జంక్షన్‌ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగుంట పంచాయతీ సింగంవలస గ్రామానికి చెందిన కుంచి సుబ్బారావు (36) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుంచి సుబ్బారావు, అతని బావమరిది పోతల నాగరాజు ద్విచక్ర వాహనంపై పాతపట్నం మండలం తెంబూరు నుంచి పెద్దలంబ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో పెద్దగుజ్జువాడ నుంచి తెంబూరు వైపు వెళ్తున్న ఒక కారు ఢీకొనడంతో సుబ్బారావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజుకు తీవ్రగాయాలవ్వడంతో 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులిచ్చిన సమాచారం మేరకు ఏఎస్‌ఐ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ప్రస్తుతం పెద్దలంబలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కుమార్తె డిల్లేశ్వరి, కుమారుడు ప్రభాస్‌ ఉన్నారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

రైతు మృతదేహం లభ్యం

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య పొలం పనుల్లో భాగంగా మంగళవారం బాహుదానది దాటుతూ నది ఉద్ధృతకు గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. అయితే బుధవారం ఉదయం బాహుదా నది ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.జనార్థనరావు మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించి, శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.

వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని గోనెలవారి వీధిలో నివసిస్తున్న తోలేటి మహేష్‌ (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ బుధవారం వెల్లడించారు. మహేష్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్య రాజేశ్వరితో కలిసి గోనెలవారి వీధిలో నివసిస్తున్నాడు. భార్య రాజేశ్వరి రైతుబజారు సమీపంలోని ఒక టైలర్‌ షాపులో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా.. ఒకరికి వివాహమై తన భర్తతో కలసి హరిపురంలో నివసిస్తోంది. రెండో కుమార్తె సౌమ్య రిమ్స్‌ కళాశాలలో నర్సింగ్‌ చదువుతోంది. రెండు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహేష్‌, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎదురింటివారు వచ్చి చనిపోయాడని నిర్ధారించారని, ఈ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని భార్య రాజేశ్వరి తెలపడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement