రణస్థలం: లావేరు మండలంలోని అదపాక గ్రామానికి చెందిన ఒక యువతి, అదే గ్రామానికి చెందిన జడ్డు సురేష్ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని అతని ఇంటి ముందు బుధవారం నిరసన తెలిపింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. తాను, సురేష్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది. సురేష్‌కు ఇద్దరు సోదరులు ఉండడంతో వాళ్లకి పెళ్లైన తర్వాత తనను వివాహం చేసుకుంటానని చెప్పి శారీరంగా దగ్గరయ్యాడని పేర్కొంది. అయితే ఇటీవల తప్పించుకొని తిరుగుతుండడంతో ప్రశ్నించడంతో.. రూ.15 లక్షల కట్నం, 10 తులాల బంగారం, సారె, ఒక బండి తీసుకొస్తే పెళ్లికి తమ ఇంట్లో ఒప్పుకుంటారని సురేష్ చెప్పినట్లు ఆమె తెలిపింది. దీనిపై లావేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. లావేరు ఎస్‌ఐ నిర్లక్ష్యంగా స్పందించి నామమాత్రపు కేసు రాసి ఇచ్చారని పేర్కొన్నారు. తదుపరి జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు సురేష్ కుటుంబ సభ్యులందరూ పారిపోయి.. దొంగతనంగా పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు న్యాయ చేయాలని కోరారు. ఈ విషయంపై ఎస్‌ఐ వి.సందీప్ కుమార్‌ను వివరణ కోరగా లావేరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేశామన్నారు. బుధవారం ఘటనపై ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.


