● విమర్శలకు తావిస్తున్న కొందరు ఫీల్డ్ అసిస్టెంట్ల తీరు ● పనుల కోసం పైరవీలు.. వేతనాల్లో వాటాలు ● ఆందోళనలో వేతనదారులు
వజ్రపుకొత్తూరు రూరల్: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పిస్తూ వలసలు నివారించాలన్న లక్ష్యంతో అమలవుతున్న వీబీ జీ రామ్‌జీ(ఉపాధి హామీ పథకం) పనుల్లో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్ల తీరు విమర్శలకు తావిస్తోంది. పని కోసం కొత్తగా జాబ్ కార్డు కావాలన్నా, కార్డులో పేరు చేర్చాలన్నా, పనులు కల్పించాలన్నా, మస్టర్ రోల్స్‌లో పేర్లు నమోదు చేయాలన్నా, వేతనాలు విడుదల కావాలన్నా కొందరు ఎఫ్‌ఏలు అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరు తమ పైవారికి కొంత సొమ్ము ముట్టచెబుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 4.34 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 3.74 లక్షల జాబ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. 7.28 లక్షల మంది వేతనదారులకు 5.76 లక్షల మంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో ప్రస్తుతం 2,03,379 మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 మండలాల్లో 2,373 రకాల ఉపాధి పనులు గుర్తించారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొన్ని తీర ప్రాంత గ్రామాల మినహా అన్ని గ్రామాల్లోనూ 30,309 మస్తర్ రోల్ విధానంలో ఉపాధి పనులు జరుగుతున్నాయి.
వారి దయ ఉంటేనే..
ఉపాధి పని కల్పించాలంటే ఫీల్డ్ అసిస్టెంట్ దయ చూపాల్సిందేనని వేతనదారులు చెబుతున్నారు. కొత్తగా జాబ్ కార్డు, పేరు చేర్చడం, పని రోజుల పెంపు, మస్టర్‌లో పేరు నమోదు కోసం కొందరు రూ.500 చొప్పున వసూళ్లు చేస్తున్నారని, పని చేసే కూలీలకు మస్టర్ వేసేందుకు, పనికి సరిపడా డబ్బులు చెల్లించేందుకు వారికి అందే వేతనాల్లో ముందుగానే రూ.100–200 అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గ్రామాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కాగా కొన్ని చోట్ల కూలీల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ అయిన తర్వాత కుడా వాటిలో కొంత తమకు ఇవ్వాలని కొందరు ఎఫ్‌ఏలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇదేంటని ప్రశ్నించే వారికి మీకు ఈ వారం పని లేదంటూ..మీ ఫేస్ పడటం లేదంటూ కొర్రీలు పెడుతూ పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్‌లో ఉపాధి పని ఇవ్వరనే భయంతో ఫిర్యాదు చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది.
పర్యవేక్షణ కరువు..
ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేలా పలు నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరడడుతోంది. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీల్లో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్‌లు చేతివాటం, నిర్లక్ష్యాన్ని తనిఖీ బృందం గుర్తిస్తూనే ఉంటోంది. అయినప్పటికీ కొందరి తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇప్పటికై నా అధికారులు క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని, సోషల్ ఆడిట్ నిర్వహించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేతనదారులు కోరుతున్నారు.


