మహేంద్ర మేళాలో ప్రయాణ పాట్లు | - | Sakshi
Sakshi News home page

మహేంద్ర మేళాలో ప్రయాణ పాట్లు

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

● సరిపడా బస్సులు లేక భక్తుల పాట్లు ● ఉచిత సీట్ల కోసం తొక్కిసలాట

● సరిపడా బస్సులు లేక భక్తుల పాట్లు ● ఉచిత సీట్ల కోసం తొక్కిసలాట

పర్లాకిమిడి : మహేంద్రగిరిపై వారం రోజులుగా జరుగుతున్న మహేంద్రగిరి మేళా కార్యక్రమం తిలకించేందుకు భక్తులు పోటెత్తుతున్నా సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా అందుకు తగ్గ బస్సులు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తొలిరోజు ఒడిశా ఆర్‌టీసీ నాలుగు బస్సులు మాత్రమే వేశారు. వాస్తవానికి వాటిలో టికెట్లు ఉచితం అయినప్పటికీ రెండో రోజు నుంచి భక్తుల నుంచి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువవ్వడంతో కొత్త బస్టాండు ఆవల కోర్టు జంక్షన్‌ వద్ద మహేంద్రగిరి బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట జరిగింది.

మహేంద్రం వద్ద ప్రమాదం..

మహేంద్రగిరి మేళాను తిలకించి వస్తున్న శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి గ్రామస్తులు మహేంద్రం ఘాటీ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ అదుపు తప్పి బోల్తాపడటంతో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మంగళవారంతో మహేంద్రమేళా ముగింపు దశకు రావడం, ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ సోమవారం పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement