
సాంకేతిక విద్యపై పట్టు సాధించాలి
ఎచ్చెర్ల : విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యతను సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీశాఖ మార్గదర్శకత్వంలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యక్‌థాన్ 2025లో భాగంగా గురువారం ఎచ్చెర్లలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లో అంతర్గత హ్యక్‌థాన్ నిర్వహించింది. క్వాంట్ కీ డిస్ట్రిబ్యూషన్ (బిబి84 ప్రోటోకాల్), క్వాంటం స్టేట్ విజువలైజర్, సూపర్డెన్స్ కోడింగ్ ప్రోటోకాల్ వంటి వినూత్న ప్రాజెక్ట్‌లను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో ఎంపికై న బృందాలు అమరావతి క్వాంటం వ్యాలీ హ్యక్‌థాన్ 2025 తదుపరి రౌండ్లలో శ్రీకాకుళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వినూత్న ఆలోచనలను అభినందించారు. క్వాంట్ సాంకేతికతలతో జాతీయ రక్షణ, నావిగేషన్, సముద్ర పరిశోధనలకు అనుమైన మార్గాలను అన్వేషించడానికి ఆర్జీయూకేటీ ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. క్వాంట్ టెక్నాలజీ ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ జాతీయ రక్షణ, నావిగేషన్, సముద్ర అధ్యయనాలకు సంబంధించి క్వాంటం సెన్సింగ్ ఫర్ మైరెన్ అప్లికేషన్‌ను పరిశోధన, ఆవిష్కరణల కోసం ఎంచుకుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్యాడ్యుయేట్ క్వాంటం విద్యను బలోపేతం చేయడానికి క్వాంటం టెక్నాలజీస్‌లో మైనర్ డిగ్రీని 480 మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. అదనంగా ప్రత్యేక మైనర్ ల్యాబ్‌లు ఏర్పాటుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టీ)కి ప్రతిపాదన సమర్పించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ ఎం.శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి సీహెచ్ వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, సీఎస్‌ఈ విభాగాధిపతి వై.రమేష్, పీఆర్‌ఓ మామిడి షణ్ముఖరావు, సహాయాచార్యులు పాల్గొన్నారు.