
ప్రాణాలు పోతున్నాయ్!
● ప్రమాదకరంగా ఆఫ్‌షోర్ కాలువ
● లోతు తెలియక ఈతకు దిగుతున్న యువత
● స్నానానికి వెళ్తూ మృత్యువాత పడుతున్న ప్రజలు
● కానరాని హెచ్చరిక బోర్డులు
మెళియాపుట్టి :
ఆఫ్‌షోర్ కాలువ ప్రమాదకరంగా మారింది. రేగులపాడు రిజర్వాయర్‌కు అనుసంధానంలో భాగంగా మెళియాపుట్టి మండలంలోని పట్టుపురం, జోడూరు, రాజపురం, అచ్చనాపురం తదితర గ్రామాలకు ఆనుకుని ఆఫ్‌షోర్ కాలువను 2008–09లో తవ్వారు. సుమారు50 అడుగుల లోతున్న ఈ కాలువ మృత్యుకాలువగా మారింది. దీని లోతు తెలియక స్నానాలకు దిగి ఈతరాక ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదు. కాలువ చుట్టుపక్కల ఎక్కడా ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 2018లో చిన్ననీలాపురం గ్రామానికి చెందిన కొల్లి తారకేశ్వరరావు ఇదే కాలువలో స్నానానికి దిగి మృతిచెందాడు. మూడురోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. 2019 మే 10న మారడికోట గ్రామదేవత ఉత్సవాలకు స్నేహితుని ఇంటికి వచ్చిన హైదరాబాద్ యువకుడు మొహద్దీన్ ఈత సరదాతో కాలువలో దిగి మృత్యువాత పడ్డాడు. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా చాలావరకు వెలుగుచూడటం లేదు. కాలువలో నిత్యం నీరు ఉండటంతో తమ మాట వినకుండా యువకులు స్నానాలకు వెళుతున్నారని, దీంతో ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నా పరిస్థితి ఎవరికీ రాకూడదు..
2018లో నా భర్త తారకేశ్వరరావు ఆఫ్‌షోర్ కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మూడురోజుల పాటు కనిపించకపోవడంతో పిల్లలతో నరకం అనుభవించాను. మూడో రోజు శవమైతేలాడు. నా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. నిత్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు స్నానాలకు కాలువ ప్రదేశానికి వెళుతుంటారు. అధికారులు స్పందించి ఏవైనా సూచికలు ఏర్పాటు చేసి ఉంటే అలా జరిగేది కాదు. – కొల్లి గుణలక్ష్మి, చిన్న నీలాపురం, మెళియాపుట్టి మండలం
ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..
చాలామంది కాలువలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కాలువ ఎంత లోతుందో తెలియక స్నానాలకు దిగుతున్నారు. గ్రామాలకు ఆనుకుని ఉండటంతో పంటపొలాల్లో పనులు చేసుకుని ఇంటికివచ్చే క్రమంలో రైతులు అదే కాలువలో స్నానాలు చేస్తున్నారు. ఏమాత్రం కాలు జారినా ప్రాణాలు దక్కవు. అధికారులు పట్టించుకోవాలి.
– సవర సూరయ్య, అచ్చనాపురం
త్వరలోనే ఏర్పాటు చేస్తాం
పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో కాలువ లోతు నిర్ధారించలేం. అందుకే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. త్వరలోనే ఏర్పాటు చేస్తాం. గ్రామాలలో పర్యటించిన సమయాల్లో సైతం యువతను అప్రమత్తం చేస్తున్నాం. ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటాం
– రాజశేఖర్, వంశధార ఈఈ, టెక్కలి

ప్రాణాలు పోతున్నాయ్!

ప్రాణాలు పోతున్నాయ్!

ప్రాణాలు పోతున్నాయ్!

ప్రాణాలు పోతున్నాయ్!