
ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి
పలాస: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాకు సన్నిహితుడు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ పలాస నియోజకవర్గ అధికార ప్రతినిధి, పెదంచల గ్రామానికి చెందిన తలగాన నరసింహమూర్తి గురువారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న తాను మద్యం సేవించి పీరుకట్ల విఠల్, పోలాకి పాపారావులను దుర్భాషలాడానని పోలీసు స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేశారని, ఫలితంగా కాశీబుగ్గ పోలీసులు తనను పిలిపించి హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని, నేను వారిని ఎప్పుడూ ఎక్కడా దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. అయినా తనను తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, భవిష్యత్తులో తన చేతిలో గంజాయో ఏ ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయని కూడా కేసు పెట్టవచ్చని సందేహం వ్యక్తం చేశారు. పీరుకట్ల విఠల్‌రావును నుంచి తనకు రక్షణ కల్పించాల వేడుకున్నాడు.