
జాతీయ వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన ఇద్దరు వాలీబాల్ క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్ వేదికగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు జరగనున్న 27వ జాతీయ బధిరుల వాలీబాల్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు జిల్లా నుంచి గుంటుకు సునీల్, సోపేటి గోపీచంద్ ఎంపికయ్యారు. సీనియర్స్ విభాగంలో వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కోడిరామూర్తి క్రీడామైదానంలో శిక్షణ పొందుతున్న వీరిద్దరూ ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో మెరిశారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్‌కాలనీలో నివాసం ఉంటున్న సునీల్ ఇప్పటికే పదుల సంఖ్యలో బధిరుల జాతీయ పోటీలతోపాటు ఆర్జెంటీనా, జపాన్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి సిక్కోలు ఖ్యాతి చెప్పాడు. ఇతని తల్లిదండ్రులు గౌరీపతి, కృష్ణవేణి. రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామానికి చెందిన సోపేటి గోపీచంద్ అనేక బధిరుల జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి అదుర్స్ అనిపించాడు. 2017లో జాతీయ సబ్‌జూనియర్స్ పోటీల్లో పతకం సాధించాడు. గోపీచంద్ తల్లిదండ్రులు రామారావు, సుశీల.
సునీల్, గోపీచంద్