అరేబియా సముద్రంలో మునిగిన షిప్‌.. నేవీ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

అరేబియా సముద్రంలో మునిగిన షిప్‌.. నేవీ ఉద్యోగి మృతి

Dec 28 2023 2:02 AM | Updated on Dec 28 2023 1:55 PM

- - Sakshi

శ్రీకాకుళం: మండలంలోని బొగాబెణి పంచాయతీ జెన్నాగాయి గ్రామానికి చెందిన ఉమ్మిడి సింహాచలం(21) ఇరాన్‌లో అరేబియా సముద్రంలో షిప్‌ మునిగిన ఘటనలో మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింహాచలం ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. నెలరోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన రుద్రాక్ష ప్రొఫెషనల్‌ కన్సల్టెన్సీ ద్వారా మర్చెంట్‌ నేవీలో చేరాడు.

తనతోపాటు మరికొంతమంది సహచరులతో కలిసి విధుల్లో ఉండగా షిప్‌ మునిగిపోయింది. మూడు రోజుల క్రితం షిప్‌ మునిగిందన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయమై స్థానిక ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డిని సంప్రదించగా ఆయన కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. సింహాచలంతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు షిప్‌ ప్రమాదంలో మృతిచెందారని, రెండు మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయని, మరో మృతదేహం దొరకాల్సి ఉందని చెప్పారు.

సింహాచలం మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఇండియన్‌ ఎంబసీతో సంప్రదించామని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, సింహాచలంకు తల్లిదండ్రులు రామయ్య, ఊర్మిళ, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక సోదరికి వివాహం కావాల్సి ఉంది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement