నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో శ్రీసుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో శనివారం నాటిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కేకేఎల్ స్వామి రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మాయాజాలం’ నాటిక ఆద్యంతం అలరించింది. మనిషికన్నా కాలం చాలా శక్తివంతమైనదని తెలియజేస్తూ కాలం ద్వారా జరుగుతున్న మాయాజాలాన్ని ప్రేక్షకుల ముందుంచారు. గుంటూరుకు చెందిన కరణం సురేష్ మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో బొమ్మిడి రామకృష్ణ రచించి దర్శకత్వం వహించిన ‘తరమెల్లి పోతున్నదో‘ నాటిక ద్వారా ప్రస్తుత సమాజంలో ఆప్యాయతలు కనుమరుగవుతున్న వైనాన్ని వివరించారు. అంతకుముందు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ కుంచాడ సోమేశ్వరరావు, ఈఈ పి.సుగుణాకరరావు, డాక్టర్ పైడి సింధూరలు మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని ఏటా నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ కంబ మురళీకృష్ణ, ఇప్పిలి శంకర్ శర్మ, గుత్తు చిన్నారావు, మండవల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ‘సమయం, ‘సూక్తం‘ నాటికలు ప్రదర్శించనున్నారు.
నాటిక పోటీలు ప్రారంభం


