అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

● ఘన నివాళులర్పించిన కలెక్టర్‌

ప్రశాంతి నిలయం: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ కొనియాడారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌.. ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని గట్టిగా నమ్మిన మహనీయుడు ఆజాద్‌ అన్నారు. అందుకే ఆధునిక సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీలు, యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ ఏర్పాటుకు అబుల్‌ కలాం ఆజాద్‌ బలమైన పునాదులు వేశారని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా జాతి ఐక్యత కోసం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రీ సర్వే ఏడీ విజయశాంతి, జిల్లా మైనార్టీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తాడిపత్రిలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు

● వైఎస్సార్‌సీపీ నాయకుడి కారుకు నిప్పు

తాడిపత్రిటౌన్‌: వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం తాడిపత్రి పట్టణ ఉపాధ్యక్షుడు అలీకి చెందిన కారుకు టీడీపీ మూకలు మంగళవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. మున్సిపల్‌ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయడాన్ని జీర్ణించుకోలేకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. ఎన్నికల నాటి నుంచి పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు రఘు అనుచరులు పవన్‌, జగన్‌, కమ్ము పలుమార్లు తనకు అడ్డుపడ్డారని, ఇంటి దగ్గరికి వచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

15న జిల్లా స్థాయి

పారా స్పోర్ట్స్‌ ఎంపికలు

ధర్మవరం రూరల్‌: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, కళాజ్యోతి ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 15న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్‌ (దివ్యాంగుల) క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిశోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు 13 ఏళ్లు పైబడిన బాలబాలికలు మాత్రమే అర్హులన్నారు. పారా అథ్లెటిక్స్‌, పారా బ్యాడ్మింటన్‌, వీల్‌చైర్‌ ఫెన్సింగ్‌, బ్లైండ్‌ గోల్‌బాల్‌, పారా తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు 15వ తేదీ ఉదయం 8 గంటలకు క్రీడా మైదానానికి చేరుకోవాలని సూచించారు.

రబీ పంటల బీమాపై మౌనం

అనంతపురం అగ్రికల్చర్‌: రబీ పంటల బీమా పథకాల అమలుపై చంద్రబాబు సర్కారు మౌనం పాటిస్తోంది. సీజన్‌ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా బీమా పథకం గురించి, ప్రీమియం గురించి ప్రస్తావనే లేదు. కాగా రబీ పంటల బీమా పథకానికి సంబంధించి ఖరీఫ్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లోనే ఆరు రకాల పంటలను నోటిఫై చేశారు. అందులో ఫసల్‌బీమా కింద గ్రామం యూనిట్‌గా పప్పుశనగను చేర్చారు. మండలం యూనిట్‌ కింద వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు వర్తింపజేశారు. పంటకోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడుల ఆధారంగా వీటికి బీమా పరిహారం లెక్క వేయనున్నారు. ఇక వాతావరణ బీమా పథకం కింద కేవలం టమాట పంటను చేర్చారు. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణం లాంటి ఆన్‌లైన్‌ డేటా ఆధారంగా పరిహారం లెక్క కట్టి ఇవ్వనున్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా విషయానికి వస్తే ఫసల్‌బీమా కింద మండలం యూనిట్‌గా వరి, వేరుశనగకు ఇచ్చారు. వాతావరణ బీమా కింద టమాటాను చేర్చారు. అయితే ప్రీమియం ఎంత, కటాఫ్‌ తేదీ... పరిహారం వర్తింపు లాంటి మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు. పప్పుశనగ సాగు సమయం ఈ నెల 15తో ముగుస్తుంది. ఈ నెల 15 నుంచి వేరుశనగ సాగుకు అనుకూలమని చెబుతున్నారు. దీంతో రబీ పంటల బీమా గురించి క్లారిటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement