పెనుకొండ రూరల్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు దీరాక రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేధింపులు తాళలేక పెనుకొండకు చెందిన పదో తరగతి విద్యార్థిని రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందన్నారు. అలాగే పరిగి మండలంలో ఆరేళ్ల చిన్నారిపై అమానుషంగా దాడి జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోందన్నారు. రాష్ట్ర మంత్రి సవిత ఇలాకాలోనే మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందన్నారు. ఆయా ఘటనల్లో నిందితులైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రాప్తాడు ఘటన మరవకముందే, హిందూపురం నియోజకవర్గంలో మరో ఘటన జరిగిందన్నారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రం బిహార్‌లా మారడంతో మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పార్టీ మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


