సర్పంచ్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

పరిగి: ‘‘మూడు పార్టీలు ఏకమైనా... దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినా... రౌడీయిడంతో భౌతికదాడులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే. ఇదే స్ఫూర్తితో పనిచేసి సర్పంచ్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటుందాం’’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె పార్టీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి అధ్యక్షతన పరిగిలోని పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పరిషత్‌ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులకు, వారి గెలుపు కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఎన్నికల్లో కూటమి నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. తమకే ఓట్లేయాలని, లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇళ్లు, పింఛన్లు పీకేస్తామని బెదిరింపులకు దిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ నుంచే గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించి, అల్లర్లకు పాల్పడ్డారన్నారు. పైగా ఓటర్లకు డబ్బులు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. అధికారంలో లేకపోయినా కూటమి ప్రభుత్వ కుట్రలకు బెదరకుండా ధైర్యంగా ఎదుర్కొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో సత్తా చూపుదాం..

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పరిషత్‌ ఎన్నికల్లో చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదామని ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మూడు పార్టీలూ ఏకమై అధికారం అండతో దౌర్జన్యాలకు దిగినా, వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను గ్రామగ్రామానా ఎగిరేలా పార్టీ మద్దతుదారులను గెలిపించుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి గడపకూ వెళ్లి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటూ కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా గెలుపొందిన శ్రీరంగరాజుపల్లి–2 ఎంపీటీసీ అభ్యర్థి శోభతో పాటూ జెడ్పీటీసీ అభ్యర్థి సత్యప్రకాష్‌, పోటీ చేసిన ప్రతి అభ్యర్థినీ ఉషశ్రీచరణ్‌ శాలువా, పూలహారాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో

నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే

కష్టకాలంలో పనిచేసిన

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement