నేడే ప్రాదేశిక పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే ప్రాదేశిక పోరు

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

సాక్షి, పుట్టపర్తి

‘పరిషత్‌’ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ జరగనుంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 1,320 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,916 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తీసుకున్న సిబ్బంది కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎంపీటీసీ స్థానాల్లో 990 మంది..

జిల్లాలోని 32 జెడ్పీటీసీ, 397 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇప్పటికే 20 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 32 జెడ్పీటీసీ, 377 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 141 మంది జెడ్పీటీసీ బరిలో, 990 మంది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్నారు.

పోటాపోటీగా..

17 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన పార్టీకే జెడ్పీ పీఠం దక్కుతుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కదిరి జెడ్పీటీసీ అభ్యర్థి వజ్రభాస్కర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌ బరిలో ఉన్నారు. అయితే కూటమి నుంచి ఎవరు బరిలో ఉన్నారనే విషయం ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు కూటమిలోని మూడు పార్టీల్లో ఏ పార్టీకి జెడ్పీ చైర్మన్‌ సీటు కేటాయించారో కూడా కూటమి పెద్దలు బహిర్గతం చేయలేదు. టీడీపీ నేతలు మాత్రం మెజార్టీ సాధించిన తర్వాత చైర్మన్‌ ఎవరన్నది నిర్ణయిస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నారు. జనసేన నేతలు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలుపుతున్నారు. ముందే చైర్మన్‌ అభ్యర్థి ఎవరన్నది తేల్చాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

అందరి దృష్టి ఆ స్థానాలపైనే..

జెడ్పీ చైర్మన్‌ రేసులో నిలిచిన వారి స్థానాలపైనే అందరూ దృష్టి సారించారు. కదిరి రూరల్‌ నుంచి వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి వజ్రభాస్కర్‌రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా నల్లచెరువు నుంచి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ పోటీలో ఉన్నారు. ఇక జెడ్పీ పీఠంపై ఆశలుపెట్టుకున్న జనసేన నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి పుట్టపర్తి రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాలపై అందరూ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే జనసేన నేతను ఓడిస్తే పోటీ ఉండదని భావిస్తున్న టీడీపీ నేతలు ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై భారీ చర్చ నడుస్తోంది.

పటిష్ట బందోబస్తు..

పరిషత్‌ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్‌ సక్రమంగా సాగేలా ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 62 మంది ఎస్‌ఐలు, 444 మంది ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌లు, 792 మంది పోలీసు సిబ్బంది, 71 మంది మహిళా పోలీసులు, 285 మంది హోం గార్డులు, 154 మంది ఏపీఎస్పీ బెటాలియన్‌ సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గోరంట్లలో సామగ్రి సరిచూసుకుంటున్న ఉద్యోగులు

32 జెడ్పీటీసీ, 377 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది.. పటిష్ట భద్రత

ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాలు..

రామగిరి మండలం: కుంటిమద్ది (సుకన్య), మాదాపురం (గంగాదేవి), ఎంసీ పల్లి (రాధాకృష్ణ), నసనకోట (భారతి), పేరూరు –2 (సుధాకర్‌), పోలేపల్లి (తిమ్మానాయుడు), రామగిరి (కురుబ రాజేశ్వరి)

కనగానపల్లి మండలం: కేఎన్‌ పాళ్యం (జోగి అంజినప్ప), వేపకుంట (చిన్న కుళ్లాయప్ప), తగరకుంట (స్వాతి)

సీకే పల్లి మండలం: బసంపల్లి (మద్దిలేటి రమణ), సీకే పల్లి–2 (నాగరాజు), మేడాపురం–1 (పసల లక్ష్మీకాంతమ్మ), నాగసముద్రం (ఓబులేసు), వెంకటాంపల్లి (అరుణ)

బత్తలపల్లి మండలం: డి.చెర్లోపల్లి (వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేపీ), మాల్యవంతం (నారాయణరెడ్డి), సంజీవపురం (చల్లా శ్రీనివాసులు), తంబాపురం (లక్ష్మీనారాయణ)

చిలమత్తూరు మండలం: దేమకేతేపల్లి (వేణుగోపాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement