అక్రమ బైండోవర్లతో వేధిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

అక్రమ బైండోవర్లతో వేధిస్తున్నారు

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

● ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారు

● అధికార పార్టీ నేతల సూచన మేరకు పోలీసులు నడుచుకుంటున్నారు

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌

పెనుకొండ రూరల్‌: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు పచ్చనేతల కనుసన్నల్లో నడుస్తూ స్వేచ్ఛను హరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. గురువారం ఆమె మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి శ్రీనివాసులు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను పోలీసులు టార్గెట్‌ చేశారన్నారు. సోమందేపల్లి ఎస్‌ఐ టీడీపీ నేతల సూచన మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా బైండోవర్‌ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెనుకొండలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను పత్రాలను ఓ టీడీపీ నాయకుడు లాక్కెళ్తుండగా. ..అడ్డుకోవాల్సిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు...టీడీపీ నేతలతో కలిసి ఈ వ్యవహారానికి సహకారం అందించినట్లు వీడియోలో కనిపిస్తోందన్నారు. ఇక గోరంట్ల సీఐ శేఖర్‌ ఆ మండలంలోని రెడ్డిచెరువుపల్లి, పూలేరు గ్రామాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కేసులు పెడుతున్నామని చెబుతున్న పోలీసులు...టీడీపీ వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, ఏంజెట్లను భయబ్రాంతులకు గురిచేసి పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు పోలీసులు సహకరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర పాల్గొన్నారు.

చిరుత దాడి..

మేకల కాపరి మృతి

అమరాపురం: మేకలకు కాపలాగా పడుతున్న కాపరిపై చిరుత దాడి చేసి ప్రాణం తీసింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున అమరాపురం మండల పరిధిలోని వి.అగ్రహారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...వి.అగ్రహారం గ్రామానికి చెందిన అళ్లదారు చంద్రప్ప (68) జీవాలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కర్ణాటక సరిహద్దులోని తన పొలంలో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మేకలను మేతకు తీసుకెళ్లి రాత్రి ఇంటి ఆవరణలో మంచంపై నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి వేళ మేకల కోసం ఓ చిరుత చంద్రప్ప దాన్ని తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే చిరుత ఒక్కసారిగా చంద్రప్ప తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చిరుత దాడిచేసిన సమయంలో చంద్రప్ప వేసిన కేకలతో ఇంట్లో ఉన్న అతని భార్య మహదేవమ్మ వెంటనే బయటకు వచ్చి చూడగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు చిరుత బోన్లను ఏర్పాటు చేసి వి.అగ్రహారం పరిసర ప్రాంతాల్లో బీట్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ధర్మవరంపై దృష్టి సారించండి

● కలెక్టర్‌, ఎస్పీలకు ఈసీ ఆదేశం

ధర్మవరం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ అత్యంత సున్నిత కేంద్రాలున్న ధర్మవరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి ధర్మవరంలోని పరిస్థితి వివరించగా, ఈసీ అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూంలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అర్చడంతోపాటు వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అంతేకాక పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి పోలింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని, అందుకు తగ్గట్లుగా అదనపు పోలీస్‌ బలగాలను సమకూర్చుకోవాలని, పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement