హిందూపురం(చిలమత్తూరు): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారం అండతో టీడీపీ నేతలు లెక్కలేనన్ని అక్రమాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు కౌంటింగ్ కేంద్రంలోనే తిష్టవేసి బ్యాలెట్‌బాక్సులు సైతం మార్చేశారన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చైర్‌పర్సన్ అభ్యర్థి షాజియా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆశీస్సులు లేకపోయినా హిందూపురం మున్సిపాలిటీ దక్కించుకోవాలన్న లక్ష్యంతోనే అరాకచం చేశారన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రంలోనే తిష్ట వేసిన ఎమ్మెల్యే పీఏలు..ఓట్లు తారుమారు చేసి చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకునే వరకు బయటకు రాలేదన్నారు. వారికి నిజంగా దమ్ముంటే కౌంటింగ్ సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని, అప్పుడే నిజమైన విజయం ఎవరిదో తెలుస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించినా, ఒకటికి రెండుసార్లు రీకౌంటింగ్ చేయించి దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అధికారులకు గానీ, టీడీపీ నేతలకు గానీ నిజాయితీగా వ్యవహరించి ఉండే సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని ఆమె సవాల్ విసిరారు.
బ్యాలెట్ బాక్సులు మార్చేశారు: వేణురెడ్డి
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మార్చేశారని వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి ఆరోపించారు. ఒక వార్డులో మూడు బాక్సులు ఉంటే...ఒక్కో బాక్సు లెక్కించాలని, కానీ అధికారులు అన్ని బాక్సుల్లోని ఓట్లు కలిపి లెక్కించారన్నారు. ఓడిపోతామనే భయంతోనే బ్యాలెట్ బాక్సులను మార్చేశారన్నారు. 29 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగిరెడ్డి విజయం సాధించగా, జీర్ణించుకోలేని టీడీపీ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ రావెళ్ల లక్ష్మి బ్యాలెట్ పేపర్లను మార్చి అనైతికంగా గెలుపొందారని మండిపడ్డారు. 29 వార్డు ఓట్ల లెక్కింపులో తప్పిదాలు జరిగాయని, తమ అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయగా, ఆయన్ను బయటకు తోసేశారన్నారు. 49 వార్డులో బాక్సులోకి మరో బూత్‌లోని బ్యాలెట్ వచ్చిందని, ఇది ఎలా సాధ్యమో ఎన్నికల అధికారులే చెప్పాలన్నారు. ఇక 44వ వార్డులో ఆసిఫ్ 70 ఓట్లతో గెలిస్తే... రీకౌంటింగ్ పేరుతో టీడీపీ అభ్యర్థిని 1 ఓటుతో గెలిచినట్లు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ అక్రమాలపై ఎంతదాకై నా వెళ్తామని, ఎవరినీవదలేది లేదన్నారు. టీడీపీకి నిజంగా మైనార్టీలపై ప్రేమ ఉంటే ముస్లిం కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, సీనియర్ నేత బాలాజీ మనోహర్, జిల్లా కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జబీఉల్లా, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి, కౌన్సిలర్లు బాబా తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పీఏలు రౌడీల్లా మారి
అధికారులను భయపెట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిచినా.. బయటకు తోసేశారు
నిజంగా వారికి దమ్ముంటే కౌంటింగ్
సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలి
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
టీఎన్ దీపిక


