సాక్షి నెట్‌వర్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ‘పచ్చ’ పార్టీ నేతలు...కోర్టులను సైతం తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ‘నకిలీ’ల వ్యవహారానికి తెరలేపారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలతో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేయించారు. తర్వాత వాటిని ఇన్‌వ్యాలిడ్ చేయించి.. ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసుకునే దిశగా ప్రణాళిక అమలు చేస్తున్నారు. వారి కుట్రలు, కుతంత్రాలు, అక్రమాలను చూసి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ‘నకిలీ’ అభ్యర్థుల వ్యవహారం వెలుగు చూసింది.
తప్పుడు నామినేషన్‌లు వేశారు.
బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి ఎంపీటీసీ స్థానానికి దరూరి వెంకటనారాయణ, మాల్యవంతం ఎంపీటీసీ స్థానానికి రాజశేఖర్‌రెడ్డి, సంజీవపురం ఎంపీటీసీ స్థానానికి యర్రాయపల్లికి చెందిన చిలమకూరి ప్రసాద్ (టీడీపీ బీఎల్‌ఏ) వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి వీరు ముగ్గురూ గ్రామస్థాయిలో టీడీపీ నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఆ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, ఇతర కీలక నేతలతో కలసి తిరిగిన ఫొటోలు కూడా సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కానీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులమంటూ నామినేషన్ వేసి టీడీపీ ‘నకిలీ’ రాజకీయానికి బాసటగా నిలిచారు. ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా మూడు రోజులూ మండల కేంద్రం బత్తలపల్లిలో ‘పచ్చ’ మూకలు రౌడీయిజం చెలాయించాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే. ఇదే క్రమంలో టీడీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుతో టీడీపీ వారే నకిలీ నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు మండలంలోని అన్ని స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారంటూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. టీడీపీ నాయకులు నకిలీ నామినేషన్లకు శ్రీకారం చుట్టడం, వారికి ఎన్నికల అధికారులు సహకరించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు వైఎస్సార్‌సీపీ తరఫున ఫేక్ నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా టీడీపీ నాయకులు భయానక వాతావరణం సృష్టించారు. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మొదటి రెండు రోజులు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క దానికి కూడా నామినేషన్ వేయలేదు. అయితే మూడవ రోజు పోలీసుల బందోబస్తుతో వెళ్లి ఆరు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కానీ రామగిరి, పోలేపల్లి, మాదాపురం, నసనకోట స్థానాలకు నామినేషన్లు వేయలేకపోయారు. అయితే నామినేషన్ల పరిశీలనలో మాత్రం ఈ నాలుగు స్థానాలకు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు చూపించి.. వాటిలో కొన్నింటిని తిరస్కరించినట్లు ప్రకటించారు. టీడీపీ వారే తమ పార్టీ పేరుతో ఫేక్ నామినేషన్లు వేయించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీటిని ఎన్నికల అధికారులు కూడా గుర్తించకుండా వాటికి పార్టీ గుర్తులు కూడా కేటాయించడంపై పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ పేరుతో
‘పచ్చ’ కార్యకర్తల నామినేషన్
తర్వాత ఇన్‌వ్యాలిడ్ అయ్యేలా
ప్రణాళిక అమలు
టీడీపీ నేతల తీరుపై ప్రజల మండిపాటు
రామగిరిలోనూ అదే తీరు..
బత్తలపల్లి మండలంలో..


