సమస్యలు పరిష్కరించకుండా..
హిందూపురం టౌన్: ‘మా సమస్యలు ఏం పరిష్కరించారు.. వార్డులో ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. రోడ్లు సరిగా లేవు. నీళ్లు ఎక్కడి పడితే అక్కడ నిలబడుతున్నాయి.. కాలువలు లేవు.. లైట్లు వెలగడం లేదు.. ఇంకా ఎన్నేళ్లు ఇలాగే ఉండాలి మేము.. హామీలు ఇచ్చిందే తప్ప తీర్చింది ఏమీ లేదు.. ఇప్పుడు మళ్లీ ఎలా ఓట్లు అడిగేందుకు వస్తున్నారు’ అంటూ హిందూపురంలో టీడీపీ నేతలను ప్రజలు నిలదీశారు. పట్టణంలోని 30వ వార్డు చాకలికుంట, ఇందినగర్ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి, నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేడెక్కిన రాజకీయ వాతావరణం
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓట్లు అభ్యర్థించేందుకు వార్డుల్లోకి వెళ్తున్న టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. ఏళ్లుగా తమ వార్డుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఓట్లు అడిగేందుకు ఎలా వస్తున్నారంటూ స్థానికులు మండిపడున్నారు. హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వీడియోల ద్వారా బయటపడగా, మిగతా మున్సిపాలిటీల్లోనూ టీడీపీ నేతలకు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. స్థానిక సమస్యలపై టీడీపీ అభ్యర్థులు, నేతలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఏం అభివృద్ధి చేశారో చెప్పండి?
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించడం సాధారణమే. అయితే ఈసారి కొన్ని వార్డుల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వర్షం పడితే నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో తమ వార్డుల్లో ఎలాంటి సమస్యలు తీరలేదని ప్రజలు వాపోతున్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఓట్లు అడిగేందుకు రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులపై స్పష్టమైన సమాధానం చెప్పాలని కొందరు అభ్యర్థులను నిలదీస్తున్నారు.
సంక్షేమ పథకాలపైనా...
ఓ వైపు మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతుండగా మరోవైపు అర్హత ఉన్నప్పటికీ తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని కొందరు ప్రజలు అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు ఉన్నా.. నేతన్ననేస్తం పథకం ఇవ్వలేదని ప్రజలు టీడీపీ అభ్యర్థితో పాటు నేతలను నిలదీస్తున్నారు. ప్రజల నిలదీతలతో అధికార పక్ష అభ్యర్థులు ప్రచారానికి వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి సెగ
వార్డుల్లోకి వస్తున్న నేతలను
సమస్యలపై ప్రశ్నిస్తున్న వైనం
అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని నిలదీత


