● ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పుట్టపర్తి: తన సేవా కార్యక్రమాలతో జిల్లా ప్రజలకు సుపరిచితుడైన కే.వజ్రభాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారికంగా సిఫారసు చేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బూల్, హిందూపురం నాయకులు వేణురెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్ర భాస్కర్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, కుల మతాలు, పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలో మొదటి జెడ్పీ చైర్మన్ మన పార్టీ నాయకుడే కావాలని ఆకాంక్షించారు. కూటమి నాయకుల తీరు, వారు చేస్తున్న దురాగతాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెండున్నరేళ్లు అయినా ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్నారని , ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు.


