ఎన్నికల పరిశీలకులుగా అరుణ్‌బాబు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలకులుగా అరుణ్‌బాబు

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి.అరుణ్‌ బాబును ఎన్నికల సంఘం నియమించింది. ఈ నెల 18న ఆయన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారన్నారు.

అభ్యర్థులకు

ఇబ్బందులు కలగరాదు

ధర్మవరం అర్బన్‌ /ధర్మవరం రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ధర్మవరంలోని మున్సిపల్‌ కార్యాలయంతోపాటు బీఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఏ వార్డుకు ఎక్కడ నామినేషన్‌ సమర్పించాలో తెలియజెపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య, తహసీల్దార్‌ దేవరాజ్‌, సిబ్బంది ఉన్నారు. అలాగే ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేంద్రాలను, స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాల సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్‌ రోజున సిబ్బందికి, ఏజెంట్లకు, మీడియా ప్రతి నిధులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పుట్టపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం ఆయన కొత్తచెరువులోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు, సౌకర్యాల కల్పనకు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

జిల్లా అంతటా వర్షం

పుట్టపర్తి అర్బన్‌: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జిల్లాలోని 30 మండలాల పరిధిలో 473.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 55.2 మి.మీ వర్షం కురిసింది. ఇక తలుపుల మండలంలో 37.2 మి.మీ, ఎన్‌పీకుంట 29.2, కదిరి 28.4, అగళి 28.4, గాండ్లపెంట 27.2, ఓడీచెరువు 25.4, బత్తలపల్లి 24.2, చిలమత్తూరు 22.4, కొత్తచెరువు 21, రొళ్ల 17.4, ధర్మవరం 16.8, గోరంట్ల 15.2, తనకల్లు 14.8, అమడగూరు 14.2, నల్లమాడ 10.8, లేపాక్షి 10.0, సోమందేపల్లి 9.4, బుక్కపట్నం 9.2, గుడిబండ 9.2, ముదిగుబ్బ 8.4, పుట్టపర్తి 8.2, సీకేపల్లి 7.4, మడకశిర 5.4, హిందూపురం 4.2, తాడిమర్రి 3.8, పరిగి 3.2, అమరాపురం 2.8, పెనుకొండ 2.6, రొద్దం మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వెల్లడించారు. తాజా వర్షాలతో ఇటీవల సాగైన ఉలవ పంటకు మేలు జరుగుతుందన్నారు. కాగా భూగర్భ జలమట్టం మాత్రం పెరిగే అవకాశం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement