టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

పెనుకొండ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల వేళ మంత్రి సవిత ఇలాకా పెనుకొండ టీడీపీలో అసమ్మతి పెల్లుబుకుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని మంత్రి సవిత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారం సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలంతా బహిరంగంగానే మంత్రి చర్యలను తప్పుపడుతూ రోడ్డెక్కారు.

రాజీనామా దిశగా శ్రీరాములు యాదవ్‌

టీడీపీ తరఫున పెనుకొండ మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో ఉన్న టీడీపీ పట్టణ కన్వీనర్‌ శ్రీరాములు యాదవ్‌ను కాదని తివేంద్ర నాయుడుకు చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో శనివారం ఆయన ఇస్లాపురం గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి సమావేశమయ్యారు. మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీని నమ్ముకుని వివిధ హోదాల్లో పనిచేశానన్నారు. పార్టీ నిర్వహించిన సర్వేల్లోనూ ఎనభై శాతం మంది తనవైపే మొగ్గ చూపినప్పటికీ, మంత్రి సవిత చైర్మన్‌ సీటు ఇతరులకు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. చైర్మన్‌ సీటు కేటాయింపుపై టీడీపీ అధిష్టానం మరోసారి పరిశీలించాలని, తమకు న్యాయం జరగకపోతే తన మద్దతు దారులతో రాజీనామాలకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

వాల్మీకులు ఎదగకూడదా?

పార్టీ కష్టకాలంలో పనిచేసిన తనకు అన్యాయం చేస్తే రెబల్‌గా అయినా పోటీ చేస్తానని 10వ వార్డుకు చెందిన టీడీపీ నాయకురాలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీదేవమ్మ హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కోసం ఎన్నికల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఊరూరూ తిరిగి కష్టపడ్డామన్నారు. అంతచేసిన తమను మున్సిపల్‌ ఎన్నికల్లో విస్మరించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తన వార్డులో తనను కాదని ఇతరులకు సీటు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి సవిత ఇన్నాళ్లూ వెంట తిప్పుకుని ఇప్పుడు అన్యాయం చేస్తే ఎలా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. మంత్రి వెంట ఉన్నవాళ్లే రూ.కోట్లు సంపాదించుకోవాలా... మేము మాత్రం కష్టపడి పనిచేసి బిచ్చగాళ్లలా ఉండిపోవాలా..? అని ఆమె ప్రశ్నించారు. వాల్మీకులు రాజకీయంగా ఎదగ కూడదా..? ఆర్థికంగా స్థిరపడకూడదా...? మా కులం అభివృద్ధి చెందకూడదా... అంటూ ఆమె మంత్రిని నేరుగా ప్రశ్నించారు. అధిష్టానం తనకు న్యాయం చేయాలని కోరారు. కాగా శనివారం రాత్రి తాము టీడీపీతోనే కలిసి నడుస్తామంటూ మహిళా నేత లక్ష్మీదేవమ్మ ఒక పత్రికా ప్రకటనలో తెలపడం కొసమెరువు.

రాజీనామా దిశగా

టీడీపీ పట్టణ కన్వీనర్‌ అడుగులు

పని చేసిన వారిని గుర్తించాలన్న

మరో మహిళా నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement