పెనుకొండ రూరల్: వైఎస్సార్ సీపీ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బోయగేరికి చెందిన వాల్మీకి శ్రీనివాసులును ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ పాలన సాగించారని గుర్తుచేశారు. పంచాయతీగా ఉన్న పెనుకొండను నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేసి రూ. కోట్లు మంజూరు చేశారన్నారు. పట్టణంలోని పలు రోడ్ల నిర్మాణాలతో పాటు రోడ్ల విస్తరణతో అభివృద్ధికి మార్గం సుగమం చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు షీ ఫారం వద్ద మెడికల్ కళాశాలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. అలాగే పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తూ కొండపైకి రోడ్డు వేసిన ఘనత వైఎస్సార్సీపీదేని గుర్తు చేశారు. అభివృద్ధికి పాటుపడే పార్టీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పెనుకొండ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వాల్మీకి శ్రీనివాసులు విజయానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ...
పార్టీ తరఫున చైర్మన్ సీటుకు పోటీచేసేందుకు తనకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. తాను 1989 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని, 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పెనుకొండ సర్పంచ్గా ప్రజలకు సేవలందించానన్నారు. 2013 నుంచి మిట్ట ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, పార్టీ మండల మాజీ కన్వీనర్లు నాగళూరు బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


