శవాలపై కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

శవాలపై కాసుల వేట

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

సాక్షి, పుట్టపర్తి: హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శవాలపై దందాకు తెరలేపారు. శవాలపై పడిన చిల్లర ఏరుకోవడం అనేది పాత సామెత.. కానీ హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మార్చురీ వద్ద శవాలను అడ్డం పెట్టుకుని చిల్లర సంపాదించుకోవాలి అనే కొత్త సామెతకు అక్కడి సిబ్బంది శ్రీకారం చుట్టారు. శవాలను అడ్డం పెట్టుకుని సిబ్బంది అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. పోస్టుమార్టం చేసి శవాన్ని ప్యాకింగ్‌ చేసి ఇవ్వడానికి భారీగా ముడుపులు డిమాండ్‌ చేస్తుండటంతో మృతుల బంధువులు లబోదిబోమంటున్నారు.

జిల్లా ప్రభుత్వాస్పత్రికి హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో పెద్దాస్పత్రి ఇదొక్కటే. ఇదే అదనుగా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగినా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకొస్తుంటారు. అలాగే రైల్వే ప్రమాదాలకు గురైన మృతదేహాలు కూడా ఈ మార్చురీకి వస్తుంటాయి. నెలలో సుమారు 20 పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ పోస్టుమార్టం చేసిన తర్వాత శవాన్ని అప్పజెప్పాలంటే సిబ్బందికి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. మృతదేహానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే మాత్రం పోస్టుమార్టం ఆలస్యం చేయడం, ఇతరత్రా కారణాలు చెబుతూ కాలయాపన చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మృతుడి కుటుంబీకులు అడిగినంత చెల్లించకుంటే ప్యాకింగ్‌ సరిగా చేయకుండానే ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. మనిషి చనిపోయాడని ఆ కుటుంబ సభ్యులు బాధలో ఉంటే ఎలాంటి కనికరం లేకుండా రాబందుల్లా శవాలపై కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందాకు సంబంధించి ఇప్పటికే పలువురు బాధితులు వైద్యశాఖాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఆస్పత్రిలో అన్ని సేవలు ఉచితమని చెబుతున్నా.. బహిరంగంగానే ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులను బాధితులు కోరుతున్నారు. విచారణ జరిపితే అన్ని విషయాలూ బయట పడతాయంటున్నారు.

అన్ని సేవలూ ఉచితమంటూనే ఇదేమిటని ప్రశ్నిస్తున్న బాధితులు

ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి

‘పురం’ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రుతి మించిన సిబ్బంది అవినీతి

పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించేందుకు భారీగా వసూళ్లు

కనికరం లేకుండా..

ఈ ఏడాది మే 1న రోడ్డు ప్రమాదంలో రామాంజి అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. పోస్టుమార్టం సమయంలో సిబ్బంది మృతుడి కుటుంబీకుల నుంచి మొదట రూ.3,800 తీసుకున్నారు. అనంతరం మళ్లీ రూ.500 డిమాండ్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించడానికి తొలుత సిబ్బంది రూ.4 వేలు డిమాండ్‌ చేశారు. బేరసారాలు సాగిన అనంతరం సిబ్బంది చెప్పిన ఫోన్‌పే నంబర్‌కు రూ.2,500 చెల్లించడంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. ఈ రెండు ఘటనల్లోనే కాదు ఆస్పత్రిలో ఎవరు చనిపోయినా మృతదేహాన్ని అప్పగించేందుకు కాసులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement