పుట్టపర్తి టౌన్: పట్టణంలో సాయి ఆరామంలో శుక్రవారం మహాత్మాగాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యశాఖా మంత్రి సత్యకుమార్, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు మహాత్మాగాంధీజీ అని కొనియాడారు. జైజవాన్, జైకిసాన్ నినాదంతో దేశానికి నూతన ఉత్తేజాన్ని అందించిన దివంగత ప్రధాన మంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి సమగ్రత, సరళత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. గాంధీజీ కన్నకలల సాధనకు స్వచ్ఛభారత్ గ్రామ స్వరాజ్య భావాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను, స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఒక్కరూ తన దైనందన జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
పోలీసు కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్‌కుమార్ హాజరై సిబ్బందితో కలసి మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి వంటి మహాత్మా గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమమన్నారు. కార్యక్రమంలో ఏఓ వేణుగోపాల్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ రాఘవన్, ఆర్‌ఐ మహేష్, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.


