పింఛన్‌ కోసం ఫొటో తీయాలంటూ కమ్మలు అపహరణ | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కోసం ఫొటో తీయాలంటూ కమ్మలు అపహరణ

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

సోమందేపల్లి: బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. బంగారం కొట్టేయడమే లక్ష్యంగా సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. సోమందేపల్లిలో జరిగిన ఘటనే దీనికి చక్కటి ఉదాహరణ. బాధితురాలు శివమ్మ వివరాలమేరకు... సోమందేపల్లికి చెందిన శివమ్మకు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మార్కెట్‌ రోడ్డులోని తన నివాసం వద్ద బయట కూర్చొని ఉంది. ఇంటి వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలితో మాట్లాడారు. తాము ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చామని.. పింఛన్‌దారులకు ఫొటో తీసి ఈ–కేవైసీ చేస్తున్నట్లు వచ్చినట్లు ఆమెను నమ్మించారు. ఈ–కేవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల్లో పింఛన్‌ రాదని భయపెట్టారు. వారి మాటలను నమ్మిన శివమ్మ సరేనని సహకరించింది. చెవుల్లో కమ్మలు ఉండకూడదని, బయటకు తీసిపెట్టాలని కెమెరా తీసేముందు వృద్ధురాలికి చెప్పారు. దీంతో ఆమె తన చెవుల్లోని బంగారు కమ్మలు బయటకు తీసి పక్కన పెట్టింది. అనంతరం కమ్మలు తీసుకున్న ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు శివమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రూ.లక్షకు

5 తులాల బంగారం !

● అమాయకులను బురిడీ కొట్టించిన లేడీ

రాప్తాడు రూరల్‌: రూ.లక్షకే ఐదు తులాల బంగారం ఇస్తానని ఓ మహిళ చెప్పడంతో పలువురు నిజమని నమ్మి మోసపోయారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన శిల్ప ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటోంది. తన భర్త దుబాయిలో ఉంటారని, అక్కడి నుంచి తక్కువ ధరకు బంగారం తెప్పించి ఇస్తానంటూ ఆమె అనంతపురం రూరల్‌ పరిధిలోని మండ్ల సుబ్బారెడ్డికాలనీకి చెందిన ముగ్గురు మహిళలను నమ్మించింది. అందులో ఒక మహిళ రూ.14 లక్షలు శిల్ప ఖాతాకు బదిలీ చేసింది. మిగిలిన ఇద్దరు కూడా రూ.లక్షల్లోనే చెల్లించారు. అయితే ఇప్పటివరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదు. పలుమార్లు డబ్బు లేదా బంగారం గురించి అడిగినా శిల్ప నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధితులు తాము మోసం పోయామని గ్రహించి అనంతపురం రూరల్‌ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

ఇద్దరు డీఎస్పీల బదిలీ

అనంతపురం సెంట్రల్‌: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబును హిందూపురం డీఎస్పీగా బదిలీ చేశారు. విజయవాడ కమిషనరేట్‌లో పనిచేస్తున్న డీఎస్పీ దైవ ప్రసాద్‌ను కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement