పట్టు రైతులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

పట్టు రైతులకు ఊరట

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

మడకశిర: పట్టు రైతులను చంద్రబాబు సర్కార్‌ ఆదుకోకపోయినా.. మార్కెట్‌ ఆదుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు రైతులకు ప్రోత్సాహం కరువైనా పట్టుగూళ్ల ధరలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉండడం ఊరటనిస్తోంది.

ఐదు నియోజకవర్గాల్లో అధికం..

జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో పట్టు రైతులు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం బీవీ (బైవోల్టిన్‌) రకం పట్టుగూళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో పట్టు రైతులు బీవీ రకం పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. సీబీ (క్రాస్‌బ్రీడ్‌) రకం పట్టుగూళ్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈరకం పట్టుగూళ్లకు ధరలు తక్కువగా ఉండడంతో ఉత్పత్తి కూడా తగ్గిపోవడానికి కారణంగా మారింది.

కేజీ పట్టుగూళ్లు

రూ.900 మార్క్‌ దాటిన వైనం

రాష్ట్రంలోనే హిందూపురంలోని ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌ ప్రధానమైనది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుండే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పట్టుగూళ్లు అమ్మకానికి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ పట్టుగూళ్ల ధర రూ.900 మార్క్‌ దాటింది. కొన్ని నెలల నుండి పట్టుగూళ్ల ధరలు నిలకడగా ఉండడం కూడా గమనార్హం. ఇంతకు ముందు కేజీ పట్టుగూళ్ల ధర రూ.800 లోపే ఉండేది. అయితే ప్రస్తుతం కేజీ పట్టుగూళ్ల ధర రూ.900 మార్క్‌ దాటడంతో పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రామనగర్‌ మార్కెట్‌లో

రూ.వెయ్యి దాటిన ధర

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా మంది పట్టు రైతులు కర్ణాటకలోని రామనగర్‌ మార్కెట్‌కు కూడా తరలించి పట్టుగూళ్లను అమ్ముకుంటారు. జిల్లాకు దగ్గరలో ఉండడంతో పట్టురైతులు ఈమార్కెట్‌ను కూడా ఉపయోగించుకుంటారు. ఈమార్కెట్‌లో హిందూపురం కన్నా అక్కడ ధర కాస్త అధికంగా ఉంటుంది. పట్టుగూళ్ల ధర కేజీ రూ.1000 మార్క్‌ దాటడం విశేషం.

చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోయినా..

చంద్రబాబు సర్కార్‌ పట్టు రైతులను ఏమాత్రమూ ఆదుకోలేదు. బైవోల్టిన్‌తో పాటు పట్టు రైతులకు ప్రోత్సాహక డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. దీనిపై పట్టు రైతుల సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు.

కేజీ పట్టుగూళ్ల ధర

రూ.900 మార్క్‌ దాటిన వైనం

పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మార్కెట్‌లో కేజీ ధర రూ.1000

ధరలు పెరగడంపై రైతుల హర్షం

ప్రోత్సాహకాల మాటే మర్చిపోయిన

చంద్రబాబు ప్రభుత్వం

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి

పట్టుగూళ్ల ధరలు ఆశాజనంగా ఉన్నాయి. కొన్ని నెలల నుంచి ధరలు రూ.900 వరకూ పలుకుతుండడంతో ఎంతో ఊరటనిస్తోంది. పంట దిగుబడి కూడా బాగా ఉండడం వరంగా మారింది. ప్రభుత్వాలు కూడా పట్టు రైతులను ప్రోత్సహించడానికి ముందుకు రావాలి. ప్రోత్సాహక డబ్బు అందించి పట్టు రైతులను ఆదుకోవాలి.

– సోమకుమార్‌, జిల్లా పట్టు రైతుల సంఘం అధ్యక్షుడు, మడకశిర

అధిక దిగుబడి సాధించడానికి వీలుగా పట్టు రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నాం. ధరలతో పాటు దిగుబడి కూడా బాగా ఉండడం పట్టు రైతులకు ఊరటనిచ్చే అంశం. ప్రోత్సాహక ధనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.

– హనుమంతరాయ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పట్టుపరిశ్రమశాఖ, మడకశిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement