అక్షరమై వెలుగు | - | Sakshi
Sakshi News home page

అక్షరమై వెలుగు

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

భావ వ్యక్తీకరణకు సులభమైన, సులక్షణమైన మార్గం అమ్మభాష తెలుగు. సంస్కృతంలోని తియ్యదనం, తమిళంలోని అమృతం, కన్నడంలోని సుమధుర పరిమళం కలగలిసిన కమ్మనైన భాష. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తేనెలొలుకు తీపి పలుకుల సోయగాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

అమ్మ భాష తెలుగు..

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మాట్లాడే భాషగా, గొప్ప సాహిత్య సంపదను కలిగిన భాషగా తెలుగు ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే మారుతున్న జీవనశైలి, ఆంగ్ల భాష ప్రభావం, సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ఇతర భాషల వినియోగం నేపథ్యంలో తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల వ్యవహారిక భాషలోనే విద్య, పాలన, సాహిత్యం కొనసాగాలని గిడుగు చేసిన ఉద్యమం తెలుగు భాష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఇంటి నుంచే మొదలు కావాలి

తెలుగు భాష పరిరక్షణ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకూడదు. పిల్లలతో తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడటం, ఇంట్లో తెలుగు పుస్తకాలు చదివించడం, తెలుగు కథలు చెప్పడం ద్వారా భాషపై చిన్నారుల్లో ఆసక్తి పెంచాలి. పాఠశాలల్లో తెలుగు భాష, సాహిత్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తెలుగు అభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉంది.

సాంకేతికతతో కొత్త పుంతలు

సెల్‌ఫోన్‌ నుంచి సామాజిక మాధ్యమాల వరకు ప్రతి చోటా తెలుగు వినియోగాన్ని పెంచితేనే భాషకు భవిష్యత్తు ఉంటుంది. తెలుగు టైపింగ్‌, తెలుగు పుస్తకాల డిజిటలీకరణ, ఆన్‌లైన్‌ తెలుగు విద్య, తెలుగు పదజాలంతో రూపొందుతున్న సాంకేతిక సాధనాలు భాషను యువతకు మరింత చేరువ చేస్తున్నాయి. యువత సోషల్‌ మీడియా వేదికల్లో తెలుగును ఎక్కువగా ఉపయోగిస్తే భాష మరింత విస్తృతమవుతుంది.

తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుతూనే ఉన్న తెలుగు భాష

వేల ఏళ్ల నుంచే వర్ధిల్లుతున్న సాహిత్యం

మాతృభాష పరిరక్షణలో

ప్రతి ఒక్కరి బాధ్యత

తెలుగు భాష అభివృద్ధికి ‘గిడుగు’ కృషి

నేడు తెలుగు భాషా దినోత్సవం

అనంతలో తెలుగు సాహితీ సౌరభం

అనంతపురం నేల...తెలుగు సాహిత్యానికి, జానపద కళలకు విశిష్టమైన కృషి చేసిన పలువురు కవులు, రచయితలు, కళాకారులకు నిలయంగా నిలిచింది. పప్పూరు రామాచార్యులు తెలుగు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించారు. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ వంటి సాహితీవేత్తలతో పాటు అనంతపురం ప్రాంతానికి చెందిన అనేక మంది కవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. జిరసం అధ్యక్షుడిగా పని చేసిన జూపల్లి ప్రేమ్‌చంద్‌, చిలకూరి దేవపుత్ర, సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి (కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత), ఏలూరి యంగన్న, శాంతినారాయణ, రాచపాళం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు అనేకమంది మాతృభాషాభివృద్ధికి అనేక రచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement